వచ్చే ఏడాది కాలంలో దేశంలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. వాటిపై ఏబీపీ సీ వోటర్ ఇటీవల ఓ సర్వే చేసింది. దాని ప్రకారం యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలో కమళదళం వికసిస్తుంది. పంజాబ్‌లో కాంగ్రెస్‌కి షాక్ తప్పదని తెలుస్తోంది. అయితే అక్కడ కాంగ్రెస్‌కు ఈ దుస్థితి ఎందుకు దాపురించింది? ఈ ప్రశ్నకు సమాధానం కాంగ్రెస్ పార్టీ స్వయంకృతాపరాధమే. దానికి పూర్తి బాధ్యత రాహుల్, ప్రియాంకలదే. సిధ్దూని పీసీసీ చీఫ్‌గా ప్రమోట్ చేయటం వల్ల ఇంటిపోరు పెరిగిందే కానీ తగ్గలేదు. సహజంగానే అది ఆప్ కి అనుకూలిస్తుంది. సర్వే చెప్పినా చెప్పకపోయినా రేపటి ఎన్నికల్లో అది కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
అత్యంత ముఖ్యమైన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ తిరిగి అధికారం హస్తగతం చేసుకోనుంది. అయితే ఈ సారి దాని బలం గణనీయంగా తగ్గనుంది. ఇప్పుడు ఆ పార్టీకి 312 మంది సభ్యులున్నారు. అయితే అది 259-267కి పరిమితం కావచ్చు. ఇక సమాజ్ వాదీ పార్టీ పరిస్థితి మెరుగుపడుతుంది. 117 స్థానాల వరకు గెలవచ్చని అంటున్నారు. బీఎస్పీకి మాత్రం 16 సీట్లు దాటవంటోంది తాజా సర్వే. కాంగ్రెస్ ఏడు సీట్లతో సరిపెట్టుకోక తప్పవు.
యూపీలో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే అది ఎవరి ఘనత. యోగి పాలన అద్భుతంగా ఉందని అర్థమా? లేక అఖిలేష్ యాదవ్ చేతకానితనమా? రాజకీయ వర్గాల్లో దీనిపై చర్చ జరుగుతోంది. కరోనా సెకండ్ వేవ్ కట్టడిలోయోగి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్న విమర్శలున్నాయి. అలాగే నూతన రైతు చట్టాల ప్రభావం యూపీలోని చాలా జిల్లాల్లో ప్రభావం చూపుతుంది. ఇంకా అనేక సమస్యలపై పోరాడే అవకాశం ఉంది. కానీ అఖిలేష్ యాదవ్ ఆ పనిచేయట్లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
మరోవైపు, సీఎం యోగీ ఆధిత్యనాధ్‌కు ప్రజల్లో ఆదరణ తగ్గలేదు. ఇప్పటికీ 44 శాతం మంది ప్రజలు ఆయన పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రేపు యూపీలో బీజేపీ గెలిస్తే అది అఖిలేష్ వైఫల్యం తప్ప మరోకటి కాదంటున్నారు విశ్లేషకులు. తిరిగి పవర్ లోకి రావాలన్న కసి ఆయనలో కనిపించట్లేదంటున్నారు వారు. పక్కా ప్లాన్‌తో గ్రౌండ్ వర్క్ లేకుండా ఎన్నికలకు వెళితే ఫలితం ఉండదు. కేవలం ఎలక్షన్ల ముందు సభలు పెట్టి గెలుస్తామంటే అయ్యే పనికాదు. బెంగాల్‌లో బీజేపీతో దీదీ ఫైట్ చూశారుగా. అఖిలేష్ కూడా ఆ రేంజ్‌లో పోరాడాల్సి వుంటుంది.
సర్వేలు చెప్పింది చెప్పనట్టు జరగకపోవచ్చు. ఫలితాలు రివర్స్ కావచ్చు. ఇదే ఏబీపీ సీ ఓటర్ బెంగాల్‌పై చేసిన సర్వే ఘోరంగా ఫెయిలంది. బీజేపీ 160 గెలుస్తుందని అంచనా వేసింది..కానీ వచ్చింది 77 సీట్లు. అలాగే తృణమూల్‌కు 112 స్థానాల కన్నా ఎక్కువ రావంది. కానీ 213 స్థానాల్లో గెలిచి సర్వేలను తలకిందులు చేసింది. కానీ పొలిటికల్ వెదర్ ఎలా వుందో వీటి ద్వారా తెలుస్తుంది. విపక్షాలను అప్రమత్తం చేస్తాయి. తప్పులు సరిచేసుకోవచ్చు. మరో ఏడాది సమయం ఉంది కాబట్టి వీటినో హెచ్చరికలా బావించాల్సి వుంటుంది.
మరోవైపు ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలకు బీజేపీ అప్పుడే కసరత్తు ప్రారంభించింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలపై యూపీ గెలుపు ఓటమిలు తీవ్ర ప్రభావం చూపుతాయి. ఆ రాష్ట్రంలో 80 లోక్‌సభ స్థానాలు ఉండటమే అందుకు కారణం. ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. తిరిగి అధికారం దక్కించుకోవాలని పక్కా ప్రణాళికలు రచిస్తోంది. యూపీ చేజారిపోతే ఢీల్లీ కూడా చేజారుతుంది. అందుకే కమళం దళం ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది.వ్యూహాలకు పదును పెడుతోంది. అందులో భాగంగా ఐదు రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ఎన్నికల ఇన్‌చార్జీలను, సహ ఇన్‌చార్జీజలను బీజేపీ నియమించింది. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు 403 అసెంబ్లీ స్థానాలున్న పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఎన్నికల బాధ్యతలను అప్పగించారు. పంజాబ్‌కు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఇంఛార్జ్. ఉత్తరాఖండ్ ప్రహ్లాద్ జోషీ, భూపేందర్ యాదవ్ మణిపూర్, దేవేంద్ర ఫడ్నవిస్ గోవా ఎన్నికల ఇంఛార్జీలుగా వ్యవహరించనున్నారు.
మరోవైపు ఈ ఎన్నికల్లో అపర చాణక్యుడు ప్రశాంత్ కిశోర్ రోల్ ఏంటి? వ్యూహకర్తగా అస్త్ర సన్యాసం చేశాడు. మరేం చేయబోతున్నాడు? ఆయన ఏ పాత్ర పోషిస్తారన్నదానిపై పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ మొదలైంది. పశ్చిమ బెంగాల్ సూపర్ సక్సెస్ తరువాత పీకేపై అంచనాలు పెరిగాయి. భారీ లక్ష్యంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తాడన్న టాక్ కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీలో చేరతాడని కూడా అంటున్నారు. వాటిని ఎవరూ కొట్టి పారేయలేదు కూడా. అయితే హస్తం తీర్థం ఎప్పుడు పుచ్చుకుంటారో తెలియదు. యూపీ ఎన్నికలకు ముందా ..తరువాతా.. అన్నది చూడాలి. అయితే కాంగ్రెస్ పాలనలోని పంజాబ్ రాష్ట్ర సలహాదారు పోస్ట్ నుంచి పీకే రీసెంట్‌గా తప్పకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పయనం ఎటువైపు అన్నది ఆసక్తిగా మారింది. 2024 ఎన్నికల్లో కింగ్ మేకర్‌గా మారాలని పీకే బావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రాంతీయ పార్టీలతో ఆయనకు మంచి సంబంధాలున్నాయి. ఇటీవలే 23 పార్టీల నేతలను కలిసి వారిని దగ్గర చేసే ప్రయత్నం చేశారు. ఒక్కో స్టేట్‌లో బీజేపీని టార్గెట్ చేసి ఓడించాలన్నది పీకే ప్లాన్. అందుకు ఆయనకు ఎదురయ్యే తొలి పరీక్ష ఉత్తరప్రదేశ్. మరి అఖిలేష్ యాదవ్ చెవిలో ఏ గెలుపు మంత్రం ఉపదేశిస్తాడో చూడాల్సి వుంది.
??