తెలంగాణలో జరుగుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నికపైనే అందరి దృష్టి నెలకొంది. టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ప్రధానంగా పోటీ నెలకొనడంతో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది. దేశంలో అత్యంత కాస్లీ ఉప ఎన్నికగా హుజూరాబాద్ ఉప ఎన్నిక రికార్డుకు ఎక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఇరుపార్టీల మధ్య హోరాహోరీ ఫైట్ తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫలితం చివరి వరకు దోబుచులాట ఆడే అవకాశం ఉండటంతో ఇక్కడి ప్రతీ ఓటు కీలకంగా మారింది. దీంతో నేతలు ఈ అంశంపై ఇప్పటికే దృష్టిసారించినట్లు తెలుస్తోంది.
హుజూరాబాద్ ఉప ఎన్నికను ఈటల రాజేందర్ వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా అందరూ చూస్తున్నారు. ఇరుపార్టీల ప్రచారం సైతం ఇదే తరహాలో కొనసాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరుపార్టీలకు కొన్ని అంశాలు అడ్వాంటేజ్ గా మారనుండగా మరికొన్ని అంశాలు మైనస్ గా మారే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈటల రాజేందర్ గతంలో హుజూరాబాద్లో చేసిన అభివృద్ధి, సానుభూతి అంశాలు కలిసి రానున్నాయి. అయితే ఆయనపై టీఆర్ఎస్ చేస్తున్న అవినీతి ఆరోపణలు ఆయనకు నెగిటివ్ గా మారే అవకాశం కన్పిస్తోంది. ఈక్రమంలో ఈటల రాజేందర్ గెలుపు అంత ఈజీ కాదనే టాక్ విన్పిస్తోంది.
టీఆర్ఎస్ మరో రెండేళ్లు అధికారంలో ఉండనుండటంతోపాటు కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కలిసి రానున్నాయి. అదేవిధంగా దళితబంధు పథకం కూడా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపుతుందనే టాక్ విన్పిస్తోంది. అయితే ప్రభుత్వంపై నిరుద్యోగ యువతలో పెద్దఎత్తున వ్యతిరేకత ఉండటం మైనస్ గా మారే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నెగిటివ్ అంశాలను ఇరుపార్టీలు ఏమేరకు తగ్గించుకుంటే వారే విజేతలుగా గెలిచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నాయి.
హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పోటీ కేవలం నామమాత్రంగానే కన్పిస్తోంది. ఆపార్టీ అభ్యర్థిని ఎంపిక చేయడానికి చాలా సమయం తీసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన బల్మూరి వెంకట్ మరో 14రోజుల్లో హుజూరాబాద్ నియోజకవర్గం అంతటా తిరిగి ప్రచారం చేయగలుగుతారా? అనేది సందేహం మారుతోంది. కాంగ్రెస్ కు ఇక్కడ బలమైన ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ అభ్యర్థి ఎంపిక ఆలస్యం కారణంగా ఆపార్టీకి చెందిన కీలక నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు. దీంతో గతంలో వచ్చిన ఓట్లైనా ఈసారి వస్తాయనేది ప్రశ్నగా తలెత్తుతోంది.
మరోవైపు టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ చేపడుతోంది. ఈటల రాజేందర్ వెంట వెళ్లిన టీఆర్ఎస్ నేతలను తిరిగి సొంతగూటికి తీసుకొచ్చింది. ఈ విషయంలో టీఆర్ఎస్ చాలా వరకు సక్సస్ అయిందనే చెప్పాలి. బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తుండగా ఆపార్టీ సీనియర్ నేతల నుంచి ఆయనకు పెద్ద సపోర్ట్ రావడం లేదు. దీంతో ఆయన తన బలాన్ని నమ్ముకునే ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నారు. సానుభూతి పవనాలు తనకు కలిసి వస్తాయని భావిస్తున్నారు. అయితే ప్రచారంలో టీఆర్ఎస్ దూకుడుగా వెళుతుండగా బీజేపీ కొంత వెనుకబడినట్లు కన్పిస్తోంది. అయితే పోలింగ్ సమయానికి కల్లా రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలు ఉన్నాయని పలువురు అంచనా వేస్తున్నారు.