2019 సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా మోదీ వేవ్ వీస్తే.. ఏపీలో వైఎస్ జగన్ వేవ్ వీచింది. అత్యధిక పార్లమెంట్ స్థానాలతో బీజేపీ దేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. సింగిల్ గానే ఆపార్టీ మెజార్టీ మార్క్ దాటడంతో సంకీర్ణ ప్రభుత్వానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో మోదీ-షా ద్వయమే కేంద్రంలో హవా కొనసాగిస్తోంది. ఇక ఏపీలో వైసీపీ సరికొత్త రికార్డు సృష్టిస్తూ అధికారంలోకి వచ్చింది. 175 అసెంబ్లీ సీట్లకుగాను ఆపార్టీ ఏకంగా 151సీట్లను తన ఖాతాలో వేసుకొంది. దీంతో ఏపీలో వైసీపీకి తిరుగులేకుండా పోతోంది.
కేంద్రంలో వరుసగా రెండుసార్లు అధికారంలోకి రావడంతో సహజంగానే బీజేపీపై కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనికితోడు కరోనా కష్టకాలంలో కేంద్రం అవలంభించిన వైఖరి ఆ పార్టీకి మైనస్ గా మారింది. ప్రత్యేక ప్యాకేజీ పేరిట ప్రకటించిన వేలకోట్ల రూపాయాలు నీటి మీద రాతలుగా మారాయి. సంస్కరణ పేరిట రైతు వ్యతిరేక చట్టాలు చేయడంతో ఆయా వర్గాల ప్రజలు కేంద్రంపై భగ్గమంటున్నారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసర ధరలు గతంలో కంటే బీజేపీ హయాంలోనే ఎక్కువయ్యాయి.
ఇవన్నీ కూడా సామాన్యులపై అధిక భారం మోపుతున్నాయి. దీంతో బీజేపీ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. మరోవైపు బీజేపీ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని ఆశపడుతోంది. కానీ ఆ పార్టీతో అంటకాగుతున్న మిత్రపక్షాలు ఒక్కొక్కటిగా దూరమవుతూ వస్తున్నాయి. ఒకటి రెండు పార్టీలు మినహా బీజేపీ కేంద్రంలో మద్దతు ఇచ్చే పార్టీలే కరువయ్యాయి. బీజేపీకి తొలి నుంచి అండగా నిలుస్తున్న పార్టీలో వైసీపీ ముందంజలో నిలుస్తుంది.
కేంద్రంలోని బీజేపీతో జగన్ సర్కార్ సానుకూల వైఖరిని ప్రదర్శిస్తూ వస్తోంది. గడిచిన రెండున్నరేళ్లుగా మోదీ సర్కార్ ఎలాంటి బిల్లులు ప్రవేశపెట్టిన పార్లమెంటులో వైసీపీ మద్దతు తెలుపుతూ వస్తోంది. రాష్ట్రపతి ఎన్నికలోనూ బీజేపీకి అండగా నిలిచింది. బీజేపీకి నమ్మకమైన మిత్రుడిగా జగన్ మిగిలారు. అయితే కేంద్రం నుంచి ఏపీకి ఆమేర మద్దతు లభించడం లేదని సీఎం జగన్ భావిస్తున్నారు. ఏపీకి రావాల్సిన స్పెషల్ స్టేటస్ ను అటకెక్కించడమే కాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించేందుకు కేంద్రం యత్నిస్తుండటం జగన్ సర్కారుకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది.
కేంద్రంతో వైసీపీ సఖ్యతగా ఉన్నా వారి నుంచి అదే స్థాయిలో మద్దతు లభించడం లేదు. దీనికితోడు ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా మోదీ ఇమేజ్ పడిపోతుంది. ఈక్రమంలోనే బీజేపీని దూరం పెట్టేందుకు సీఎం జగన్ యత్నిస్తున్నారు. బీజేపీ కేంద్రంలో ఒకలా, రాష్ట్రంలో మరోలా ఉంటుండటం కూడా ఆయనకు నచ్చడం లేదట. దీంతో ఇక నుంచి కేంద్రంలోని బీజేపీ అన్ని విషయాల్లో గుడ్డిగా మద్దతు ఇవ్వకూడదని జగన్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. భారత్ బంద్ విషయంలో మోదీ సర్కారు వ్యతిరేకంగా వైసీపీ మద్దతు ఇవ్వడం కూడా దీనిలో భాగమేనని తెలుస్తోంది.
వచ్చేసారి కూడా ఎలాగైనా గెలవాలని చూస్తున్న సీఎం జగన్ రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీని పక్కన పెట్టేందుకు సిద్ధమవుతున్నారన్న టాక్ నడుస్తోంది.. అయితే బీజేపీ పెద్దలు మాత్రం జగన్ కు వదులుకునేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. రాబోయే ఎన్నికలను ఛాలెంజ్ తీసుకున్న బీజేపీ ఏపీకి కొన్ని తాయిళాలను ప్రకటించిన జగన్ ను తనవైపు తిప్పుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. ఏదిఏమైనా ఈ రెండు పార్టీల మధ్య గతంలో కంటే గ్యాప్ పెరిగినట్లే కన్పిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈక్రమంలోనే సీఎం జగన్ మోదీకి ఝలక్ ఇవ్వబోతున్నారనే చర్చ ఏపీలో జోరుగా సాగుతోంది.