పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ గెలుపుతో ఆప్ రాజకీయ సోపానంలో ఒక అడుగు ముందుకు వేసింది. ఇదే సమయంలో ఇది ఎవరికి ఇబ్బందికరంగా పరిణమిస్తుంది అనే చర్చ కూడా మొదలైంది. ఐతే, ఎవరి సంగతి ఎలా ఉన్నా అధికార బీజేపీకి వచ్చే ముప్పు ఉండకపోవచ్చు. ఆ పార్టీ నేతలు కూడా ఇదే మాట చెబుతున్నారు.
బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఆప్ ఆవిర్భవించాలంటే దాని ఖాతాలో 100 లోక్‌సభ స్థానాలైనా ఉండాలి. గెలిచే అవకాశాలు ఉండాలి. కనీసం గెలవగలిగే స్థితిలో అయినా ఆ పార్టీ ఉండాలి అనేది బీజేపీ నేతల వాదన. ఢిల్లీ, పంజాబ్ అసెంబ్లీలను గెలిచి ఓ రాజకీయ పార్టీగా ఆప్ ఎంతో ఎదిగింది. ఐతే , అది ఏ స్థాయిలో ఎదుగుతుందో అదే స్థాయిలో బిజెపి వ్యతిరేక ఓట్లను చీలుస్తుందని కమలనాథులు ఆనందిస్తున్నారు.
గతంలో కాంగ్రెస్ సుస్థిరమైన జాతీయ పార్టీగా అనేక దశాబ్దాల పాటు దేశాన్ని ఏలింది. అలాగే ఇప్పుడు బీజేపీ కూడా మరో 20 ఏళ్లు అధికారంలో ఉండటం ఖాయం అంటున్నారు ఆ పార్టీ నేతలు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న రాజకీయ శూన్యాన్ని పూరించటంలో కాంగ్రెస్ విఫలమవుతోందని ఇప్పటికే అన్ని పార్టీలకు, ప్రజలకు అర్థమైంది. మరి ఆ ఖాలీని ఎవరు పూరిస్తారన్నది ఇప్పుడు ప్రశ్న. అందుకు తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య రేసు మొదలైంది. పంజాబ్ విజయంతో టీఎంసీ కన్నా ఆప్ ఎంతో ముందుకు దూసుకుపోయింది.
బీజేపీకి ఏకైక జాతీయ ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకు తీసికట్టుగా మారింది. అందుకే బీజేపీ సహా అన్ని పార్టీలు హస్తం పార్టీని ఖాళీ చేయించే పనిలో ఉన్నాయి. కానీ అది అంత సులభం కాదని అందరికీ తెలుసు. బీజేపీకి, ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే లోక్‌సభలో కనీసం 100 సీట్లు గెలిచే సత్తా ఉండాలి. ఆప్‌కు గానీ, తృణమూల్‌కు గానీ అది ఇప్పట్లో సాధ్యమయ్యే పనేనా? ఐతే, ఈ రేసులో ఎప్పటికైనీ బీజేపీకి ధీటైన ప్రత్యమ్నాయం ఆప్ మాత్రమే కాగలదని బీజేపీ నేతలు సైతం విశ్వసిస్తున్నారు. ఆప్ వ్యూహాలు, అనుసరించే పద్ధతులు బీజేపీని పోలి ఉండటమే వారు ఈ అంచనాకు రావటానికి కారణం.
ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తుంది. బలమైన, ఆకర్షణీయమైన నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ దాని నాయకుడుగా ఉన్నారు. ఆప్ బలహీన వర్గాలను కూడా ఆకర్షిస్తుంది. ఈ వర్గాల ఓటర్లు ఆయనపై విశ్వాసం చూపారు. కనుక దీర్ఘకాలంలో ఆప్ ఎదుగుదల బీజేపీకి ఏ మాత్రం క్షేమం కాదని ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. మహిళలు, బలహీనవర్గాలలో ఆప్ పట్ల ఆకర్షణ పెరుగుతోంది. ఇలాగే పట్టుదలతో ముందుకు సాగితే భవిష్యత్‌లో ప్రబల రాజకీయ శక్తిగా ఎదుగుతుందని అన్ని రాజకీయ పార్టీలు అంగీకరిస్తున్నాయి. ఐతే, రాజకీయాలు పూర్తిగా మనం ఊహించినట్టు ఉండవు. ఆప్ మనుగడ రాబోవు రోజుల్లో ఎలా ఉంటుందో ఇప్పుడే ఊహించజాలం.
పంజాబ్ గెలుపు ఉత్సాహంతో ఈ ఏడాది చివరలో జరిగే హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల్లో కనీస విజయాలకు తన శక్తివంచన లేకేండా కృషి చేస్తుంది. ఢిల్లీ, పంజాబ్ పొరుగున ఉన్న హర్యానా లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఏది ఏమైనా బీజేపీకి సుస్థిర ప్రత్యామ్నాయంగా మారాలంటే ఆప్ కనీసం 50 లోక్‌సభ ఎంపీలతో తన ప్రయాణం ప్రారంభించాల్సి వుంటుంది. ఇది మమతా బెనర్జీ, ఎం కే స్టాలిన్ విషయంలో సాధ్యం కావచ్చు. ఎందుకంటే వారి సొంత రాష్ట్రాలైన బెంగాల్‌లో 42, తమిళనాడులో 39 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. కానీ పంజాబ్, ఢిల్లీ రెండూ కలిపినా కేవలం 20 సీట్లే. రాజకీయాల్లో చివరకు చూసేది అంకగణితాన్నే. కనీసం 50 సీట్లు సాధించినా మాజీ ప్రధానులు హెచ్‌డి దేవెగౌడ, ఐ కె గుజ్రాల్ లా కొంతకాలం ఆ ప్రధాని పీఠంపై కూర్చునే అవకాశం రావచ్చు. ఐతే, ఆమ్ ఆద్మీ పార్టీ లక్ష్యాలు చాలా దీర్ఘకాలమైనవి. ఇకేసారి అన్ని రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని ఆ పార్టీ ముందుకు వెళ్లటం లేదు. ఒక్కో రాష్ట్రాన్ని లక్ష్యంగా చేసుకుంటూ ముందుకు వెళుతుంది. కాస్త ఆలస్యమైనా సమూలంగా ఊడ్చేస్తుంది.
ఆప్ గెలిస్తే మామూలుగా గెలవదని ఢిల్లీలో చూశాం. ఇప్పుడు పంజాబ్ అనుభవం కూడా అదే చెబుతోంది. అందుకే ప్రఖ్యాత పాత్రికేయుడు శేఖర్ గుప్తా ఆప్ విజయాలను మంగోలియన్ల దండయాత్రలతో పోల్చారు. తమకు అడ్డం వచ్చిన వాటిని సమూలంగా పెకిలించుకుంటూ వెళ్లటం మంగోల్స్ లక్షణం. ఆప్ విజయాలు కూడా ఒకరంగా రాజకీయ దండయాత్ర కిందే లెక్క. 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో రెండు సార్లు 60కి పైగా సీట్లు కొల్లగొట్దింది. ఇప్పుడు 117 సీట్లున్న పంజాబ్ అసెంబ్లీలో 92 స్థానాలను సొంతం చేసుకుంది.
పంజాబ్ గెలుపుతో ఆ పార్టీ ఖాతాలో రెండు రాష్ట్రాలు పడ్డాయి. దాని తరువాత లక్ష్యం గుజరాత్.ఈ ఏడాది చివరలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధాని సొంత రాష్ట్రం అయినందున బీజేపీకి అక్కడ గెలుపును ప్రతిష్టాత్మకంగా బావిస్తుంది. బీజేపీకి కాంగ్రెస్ నుంచి భయం లేదు. కానీ ఆప్‌ను అలా తీసిపారేయలేదు. ఇప్పటికిప్పుడు గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ దానికి ప్రధాన ప్రత్యర్థి కాకపోవచ్చు. కానీ ఈ సారి కనీసం ఐదారు సీట్లు గెలిచి అసెంబ్లీలో పాదం మోపినా అది బీజేపీ ప్రభుత్వానికి ఇబ్బందే అవుతుంది.
దేశంలో ఇప్పటి వరకు అనేక పార్టీలు ఉద్భవించాయి. వాటిలో కొన్ని విజయవంతమ్యాయి. కొన్ని కాల గర్భంలో కలిసిపోయాయి. ఇప్పడు మనుగడలో ఉన్న పార్టీలలో కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం మినహాయిస్తే ఏ పార్టీ ఒక రాష్ట్రానికి కి మించి అధికారంలో రాలేదు. టీడీపీ, తృణమూల్, డీఎంకే, టీఆర్‌ఎస్, ఎస్పీ, ఆర్‌ఎల్‌డీ, బీఎస్పీ, జేడీయూ, జేడీఎస్, ఎన్సీపీ ఇలా ఎన్నో పార్టీలు ఒక్క రాష్ట్రానికే పరిమితమైనవి. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌లో విజయం సాధించి దేశంలో సరికొత్త రాజకీయానికి తెరలేపింది.
జాతీయవాదం, ప్రజా సంక్షేమం, మతం వంటి అత్యంత సున్నిత అంశాల విషయంలో బీజేపీని కాంగ్రెస్ సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతోంది. కానీ, ఆప్ ఈ విషయంలో పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. ఇదే బీజేపీకి అధికంగా ఆందోళన కలిగిస్తోంది.!!