కేంద్రంలోని బీజేపీకి కొరకరాని కొయ్యగా పశ్చిమబెంగాల్ మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే బీజేపీ ఇక్కడ అధికారంలోకి రావడానికి సర్వశక్తులను ఒడ్డింది. మరోవైపు అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ సైతం తన పట్టును కాపాడుకునేందుకు శతవిధలా ప్రయత్నించింది. హోరాహోరీ ఫైట్లో బీజేపీపై తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన మమత బెనర్జీ మాత్రం ఓటమి పాలవడం బీజేపీకి కొంత ఊరటను ఇచ్చింది. అయితే ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు రావడంతో మరోసారి మమత బెనర్జీనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ క్రమంలోనే గతంలో తృణమూల్ కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన నేతలంతా తిరిగి సొంతగూటికి చేరుకుంటున్నారు. దీనికితోడు బీజేపీ నేతలు సైతం తృణమూల్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. దీంతో బీజేపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులున్నాయి. తాజాగా బీజేపీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి, బాలీవుడ్ సింగర్ బాబులాల్ సుప్రియో ఆపార్టీని వీడి తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. ఆయన 2019 ఎన్నికల తర్వాత కేంద్ర పర్యావరణ శాఖ మంత్రిగా పని చేశారు. అయితే కిందటి ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ అసెంబ్లీ సీట్లు గెలుచుకునేలా ప్లాన్ చేసింది. దీనిలో భాగంగా బాబులాల్ సుప్రియోకు అసెంబ్లీ సీటు ఇచ్చారు. అయితే ఆయన ఓటమి పాలవడంతో బీజేపీ హైకమాండ్ అతడి కేంద్ర మంత్రి పదవిని పీకేసింది.
దీనికితోడు బెంగాల్లోని బీజేపీ నేతలకు సుప్రియోకు మధ్య పొసగడం లేదు. మరోవైపు ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో సుప్రియోకు మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన కొంతకాలంగా బీజేపీకి దూరంగా ఉంటున్నారు. ఈక్రమంలోనే క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన సుప్రియో తాజాగా ఆపార్టీకి షాకిస్తూ తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. ఇక త్వరలోనే బెంగాల్లో మూడు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల జరుగనున్నాయి. ఈనేపథ్యంలో బాబులాల్ సుప్రియో బీజేపీకి హ్యాండిచ్చి తృణమూల్ కాంగ్రెస్ లో చేరడం చర్చనీయాంశంగా మారింది.
బీజేపీ సైతం ఉప ఎన్నికలను ఛాలెంజ్ గా తీసుకొని బరిలో దిగుతుంది. ఈ సమయంలోనే బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గా బాబులాల్ సుప్రియో పేరు ప్రముఖంగా విన్పించింది. అయితే సుప్రియో మాత్రం బీజేపీకి హ్యాండిచ్చి తాజాగా తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. వచ్చే ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ సైతం భవానీపూర్ నుంచి బరిలో నిలుస్తున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా తన ముఖ్యమంత్రి స్థానాన్ని ఆమె పదిలం చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ నుంచి తృణమూల్ కాంగ్రెస్ లోకి వలసలు షూరు అయ్యాయి. దీంతో బీజేపీకి వరుస ఎదురుదెబ్బలు తగులున్నాయి. బెంగాల్ లో హ్యాట్రిక్ సార్లు ఓడిపోవడంతో ఇక బీజేపీపై అక్కడి నేతల్లో నమ్మకం పోతోంది. అందుకే బలమైన తృణమూల్ లోకి ఇప్పుడు క్యూ కడుతున్న పరిస్థితి నెలకొంది.