India: బద్ధకం వలన భారతదేశానికి అన్ని కోట్లు నష్టమొస్తుందా అంటే.. అవును నిజమే అంటున్నాయి సర్వేలు. పనిపాట లేకుండా తిరిగేవారు వలన ఇండియాకు రూ.25600 కోట్లు భారం పడుతుందట. నమ్మడం లేదా.. అరే నిజమండీ బాబు.. ప్రపంచ ఆరోగ్యసంస్థనే ఈ నివేదికను వెల్లడించింది. శారీరక శ్రమ లేకపోవడం వలన వారు త్వరగా అనారోగ్యానికి గురి అవ్వడం, ఆ తరువాత హాస్పిటల్ బిల్స్ ఇలా మొత్తానికే భారం పడుతున్నదట. ఇండియాలో 11 ఏళ్ల నుంచి 17 ఏళ్ళ వయసున్న వారిలో 74 శాతం మంది శారీరక శ్రమ చేయడం లేదని నివేదిక తెలిపింది.
ఇక ఈ బద్దకంలో కూడా బాలికలే అగ్రస్థానం ఉండడం విశేషం. వీరిలో బాలురు 72 శాతం బాలికలు 76 శాతం ఉన్నారని తేలింది. 18 ఏళ్లు పైబడిన వారిలో మహిళలు 44 శాతం పురుషులు 25 శాతం వ్యాయామం చేయడం లేదని చెప్పుకొచ్చింది. ఇక ముసలివారిలో కూడా ఎక్కువగా మహిళలే శారీరక శ్రమ చేయడం లేదని చెప్పుకొచ్చారు. 70 ఏళ్లు పైబడిన వారిలో మహిళలు 60 శాతం పురుషులు 38 శాతం ఉన్నారట. వీరు పనులు చేయకపోవడం వలన వచ్చే జబ్బులను నయం చేయడానికి అయ్యే ఖర్చు దేశంలో ఏడాదికి రూ.25600 కోట్లని అంచనా. ఊబకాయం, గుండె సంబంధిత సమస్యలు, చర్మ రుగ్మతలు, ధీర్ఘకాలిక జబ్బులైన బీపీ, షుగర్, పక్షవాతం, గుండె క్యాన్సర్ ఇలా వచ్చి ఎంతో సఫర్ అవుతున్నారని తెలిపింది. ఇక వచ్చే పదేళ్లలో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని, ముఖ్యంగా ఇండియాలో ఈ కేసులు ఇంకా ఉండనున్నాయని స్పష్టం చేసింది.