Hugo Boss Sells Bathroom Chappals For 9000 Rupees: మనం సాధారణంగా వాడే చెప్పులు, బాత్రూంలో వేసుకునే చెప్పులకు ఎంత తేడా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సాధారణంగా వేసుకునే పాదరక్షల ధర వందల నుంచి వేలల్లో ఉంటే, బాత్రూంలో వేసుకున్న స్లిప్పర్స్ మాత్రం రూ. 100 – 150 మధ్యలోనే దొరుకుతాయి. కానీ.. లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ హుగో బాస్ మాత్రం స్లిప్పర్స్‌కు ఏకంగా రూ. 8,990 ధర కేటాయించింది. అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. అంత ధర పెట్టారంటే, కచ్చితంగా ఆకర్షణీయంగా ఉండొచ్చని మీరు అనుకుంటే మాత్రం పప్పులే కాలేసినట్టే! ఎందుకంటే.. వాటి కంటే ఫుట్‌పాత్‌లో దొరికే స్లిప్పర్లే మరింత అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఆల్రెడీ వాడిన చెప్పుల్లా ఆ స్లిప్పర్స్ ఉంటాయి. అలాంటి చెప్పులకు ఏకంగా 9 వేల దాకా ధర పెట్టడంతో.. నెటిజన్లు షాక్‌కి గురవుతున్నారు.
ఇలాంటప్పుడు నెటిజన్లు ఏం చేస్తారో తెలుసుగా.. తమ ప్రతిభనంతా వినియోగించుకొని, విపరీతంగా ట్రోల్ చేసి పారేస్తారు. ఇక్కడ ఈ చెప్పుల విషయంలోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. రూ. 150 ధర పెట్టే స్థాయి కూడా లేని ఈ చెప్పులకు రూ. 8,990 పెట్టి ఏ ఒక్కరు కొనరని కొందరు హేళన చేస్తున్నారు. ఇంకొందరేమో ఈ చెప్పులు డీమార్ట్‌లో రూ. 99 లకే లభ్యమవుతాయని జోకులు పేల్చుతున్నారు. ఓ నెటిజన్ ఏమో.. నేను కోటీశ్వరుడ్ని అయినా సరే, ఇలాంటి చెత్త చెప్పుల్ని అంత ధర పెట్టి కొనుగోలు చేయనని చులకన చేసి చెప్పారు. మరొక నెటిజన్ అయితే ఇంకో అడుగు ముందుకేసి.. ‘ఈ హవాయి చెప్పులు యూఎస్‌కి వెళ్లి ఎంబీఏ చేసినట్టున్నాయి, అందుకే అంత ధర కేటాయించినట్టు తెలుస్తోంది’ అంటూ కౌంటర్ వేశాడు. కాగా.. హుగో బాస్ ఒక లగ్జరీ బ్రాండ్. ఇందులో దొరికే వస్తువుల ఖరీదు కళ్లు బైర్లు కమ్మే రీతిలోనే ఉంటాయి. అందుకే, బాత్రూం చెప్పులకు కూడా అంత ధర పెట్టినట్టు తెలుస్తోంది. ఏదేమైనా.. ట్రోల్స్ ద్వారా ఆ చెప్పులకు బాగానే పబ్లిసిటీ వచ్చిపడినట్లైంది.