NTV Telugu Site icon

Dwarf Couple: అర్థరాత్రి వీళ్లు చేసిన సాహసానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

Dwarf Couple Caught Thief

Dwarf Couple Caught Thief

మనోబలం ఉంటే దేన్నైనా ఎదురించొచ్చన్న నానుడిని ఓ మరుగుజ్జు జంట నిరూపించింది. తాము పొట్టిగా ఉన్నంతమాత్రాన చేతకానివాళ్లం కాదని, తమని తక్కువ అంచనా వేయొద్దని చాటిచెప్పారు. తమ ఇంట్లోకి చొరబడిన దొంగను ధైర్యంగా ఎదుర్కోవడమే కాకుండా, పారిపోకుండా కట్టిపడేశారు. ఈ ఘటన బీహార్‌లోని బక్సర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

బక్సర్ జిల్లాలోని కృష్ణబ్రహ్మం పోలీస్ స్టేషన్ పరిధిలోని నువాన్ గ్రామంలో రంజిత్ పాశ్వాన్, సునైనా అనే మరుగుజ్జు దంపతులు నివసిస్తున్నారు. ఇటీవల అర్థరాత్రి సమయంలో వీరి ఇంట్లోకి ఓ దొంగ ప్రవేశించాడు. అల్మారా తెరిచి సామాన్లు తీస్తుండగా.. శబ్దం వినిపించింది. దీంతో తమ ఇంట్లోకి దొంగ ప్రవేశించాడన్న విషయాన్ని గ్రహించిన ఆ దంపతులు.. భయపడకుండా ధైర్యం ప్రదర్శించారు. అతడ్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. దొంగకు అనుమానం రాకుండా పట్టుకునేందుకు ఓ పక్కా ప్లాన్ వేసుకున్నారు.

ప్లాన్ ప్రకారం.. దంపతులిద్దరు ధైర్యం కూడగట్టుకొని, ఆ దొంగపై ఎగబడ్డారు. ఆ దొంగ తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా.. వాళ్లు పారిపోనివ్వలేదు. అతనికి తమదైన శైలిలో తగిన బుద్ధి చెప్పి, చివరికి పారిపోకుండా పోల్‌కు కట్టేశారు. అనంతరం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ దొంగను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన తర్వాత స్థానిక ప్రజలు ఆ మరుగుజ్జు దంపతుల సాహసాన్ని, ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.