Minister KTR: కేటీఆర్ లాంటి యంగ్ అండ్ డైనమిక్ మంత్రి కేరళకు కూడా కావాలని ఆ రాష్ట్రానికి చెందిన కైటెక్స్ గార్మెంట్స్ కంపెనీ ఎండీ సబూ జాకబ్ అన్నారు. తెలంగాణ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌లోని అద్భుతమైన నాయకత్వ లక్షణాలకు అద్దం పట్టే ఒక ఉదాహరణను ఆయన ప్రస్తావించారు. ఒకానొక సందర్భంలో తాను.. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు కావాలా? (లేక) ఉపాధి కల్పన కావాలా? అని మంత్రి కేటీఆర్‌ని అడిగితే.. ఆయన వెంటనే ఎంప్లాయ్‌మెంట్ జనరేషనే కావాలని చెప్పినట్లు జాకబ్ గుర్తుచేసుకున్నారు.
read more: IPL: క్రికెట్ అభిమానులకు ముఖేష్ అంబానీ కానుక?
మా దగ్గర పెట్టుబడులు పెట్టండి అంటూ అన్ని రాష్ట్రాలూ తమను ఆహ్వానించాయని, అయితే.. మిగతా స్టేట్లతో పోల్చుకుంటే తెలంగాణలో తమను రిసీవ్ చేసుకున్న తీరు చాలా గొప్పగా ఉందని మెచ్చుకున్నారు. కేరళ నుంచి వచ్చేందుకు తమ కోసం ప్రత్యేక విమానాన్ని పంపారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు అనువైన ప్రదేశాలను చూడటానికి ఏకంగా హెలికాప్టర్ ఏర్పాటుచేశారని తెలిపారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను చూశామని, అక్కడ ఈ ఏడాది జూన్ నాటికి తమ సంస్థ తొలి యూనిట్‌ని అందుబాటులోకి తెస్తుందని ప్రకటించారు.
రెండేళ్ల కింద జరిగిన ఈ విషయాన్ని ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన సీఐఐ వార్షిక సమావేశంలో కైటెక్స్ గార్మెంట్స్ ఎండీ పేర్కొన్నారు. మొదట్లో తాము వెయ్యి కోట్ల రూపాయలు మాత్రమే ఇన్వెస్ట్ చేయాలనుకున్నామని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలను, పనితీరును గమనించాక ఈ పెట్టుబడులను 3 వేల కోట్ల రూపాయలకు పెంచామని వెల్లడించారు. తమలాగే కేరళలోని ఎంతో మంది పారిశ్రామికవేత్తలు తెలంగాణలో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారని సబూ జాకబ్ తెలిపారు.
కేరళలో రాజకీయ వేధింపులు తట్టుకోలేకే బయటి రాష్ట్రాల్లో పెట్టుబడి పెడుతున్నామని, తెలంగాణలో చేస్తున్న ఇన్వెస్ట్‌మెంట్ వల్ల 28 వేల మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పారు. కైటెక్స్ గార్మెంట్స్ సంస్థ కేరళలో చిన్న పిల్లల దుస్తుల రంగంలో 2వ అతిపెద్ద కంపెనీ. 1960లో స్థాపించిన ఈ సంస్థ నిత్యం దాదాపు పది లక్ష వస్త్రాలను అమెరికాకు ఎగుమతి చేస్తోంది. ఇక్కడి యూనిట్ అందుబాటులోకి వస్తే పాతిక లక్షల మేడిన్ తెలంగాణ ఉత్పత్తులను ఎగుమతి చేయనుంది. కైటెక్స్ గార్మెంట్స్ కంపెనీ తెలంగాణ యూనిట్‌లో 80 శాతం మంది మహిళలకే అవకాశం ఇవ్వనుంది. శిక్షణ అందించి మరీ వారి సేవలను వినియోగించుకోనుంది.