EMIs High-No Extension: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల మరోసారి రెపో రేటును పెంచిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే లోన్లు తీసుకున్నవాళ్ల పరిస్థితి ఏంటనేది చర్చనీయాంశమైంది. రుణం తిరిగి చెల్లించే వ్యవధి పెరుగుతుందా?.. లేక.. ఈఎంఐ మరింత భారంగా మారుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇన్నాళ్లూ రెపో రేటు పెరిగిన ప్రతిసారీ వినియోగదారులు ఈఎంఐ అమౌంట్‌ని పెంచుకోకుండా లోన్ రీపేమెంట్ డ్యూరేషన్‌ని పెంచుకునేవారు.
కానీ.. ఇప్పుడు ఆ పరిస్థితిలేదని నిపుణులు అంటున్నారు. గతంలో నాలుగు సార్లు రెపో రేటు పెరిగినప్పుడు లోన్ రీపేమెంట్ టైమ్‌ని ఎక్స్‌టెన్షన్ చేసుకున్నవాళ్లు ఇప్పుడు కూడా మరోసారి పొడిగింపు కోరుకుంటే దానివల్ల లోన్‌పై నెగెటివ్ ప్రభావం పడుతుందని చెబుతున్నారు. అంటే.. మంత్లీ ఇంట్రస్ట్ పేమెంట్ అనేది ఈఎంఐ పరిధిలోకి రాదు. ఫలితంగా.. నెల నెలా ఈఎంఐలు కడుతున్నప్పటికీ ప్రిన్స్‌పల్ అమౌంట్ మాత్రం పెరుగుతూ పోతుందని హెచ్చరిస్తున్నారు.
read also: Small Loans-Better Payments: తిరిగివ్వటంలో.. తనదైన ‘‘ముద్ర’’
ఈ నేపథ్యంలో.. ముఖ్యంగా హోం లోన్ తీసుకున్నవారిపై లేటెస్ట్ రెపో రేటు పెంపు ప్రభావం తీవ్రంగా పడుతుంది. గతంలోని నాలుగు సార్లుతో పోల్చితే తాజాగా పెరిగిన రెపో రేటు తక్కువే అయినప్పటికీ ఈ వాస్తవ పరిస్థితిని తలచుకొని గృహ రుణగ్రహీతలు ప్రస్తుతం షాక్‌కు గురవుతున్నారు. హోం లోన్‌కి చెల్లించాల్సిన నెలవారీ వాయిదా మరో 3 నుంచి 5 శాతం పెరుగుతుందని ఇండియా మార్టగేజ్ గ్యారంటీ కార్పొరేషన్ చీఫ్ రిస్క్ ఆఫీసర్ శ్రీకాంత్ శ్రీవాస్తవ చెప్పారు.
నాలుగు సార్లు కలిపి రెపో రేటు 190 బేసిస్ పాయింట్లు పెరిగింది. దీంతో గతంలో లోన్ రీపేమెంట్ పీరియెడ్‌ను 20 ఏళ్లుగా నిర్దేశించుకున్నవాళ్లు దాదాపు మరో 13 ఏళ్లపాటు ఈఎంఐలు చెల్లిస్తూ పోవాల్సి ఉంటుందని తెలిపారు. ఇల్లు కొనేటప్పుడు 6 శాతం వడ్డీ రేటుతో లోన్ తీసుకున్నవారికి ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు. రుణాన్ని తిరిగి చెల్లించే గడువును పెంచుకోకుండా ఈఎంఐ అమౌంట్‌ను పెంచుకున్నవారిపై సుమారు 20 శాతం అదనపు భారం పడుతోందని శ్రీవాస్తవ వివరించారు.