Backward China: కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకవని ఒక సామెత ఉంది. అదిప్పుడు చైనాకి సరిగ్గా సరిపోతుంది. ఆ దేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అయినా ఏం లాభం? అంత గొప్ప పేరు కూడా కరోనా ముందు లోకువ అయిపోయింది. జీరో కొవిడ్ పాలసీ కారణంగా చైనా ఎకానమీ 50 ఏళ్లు వెనక్కి వెళ్లింది. రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎదురుతన్నటం కూడా దీనికి మరో ప్రధాన కారణంగా నిలిచింది.
read more: Apple Company: iPhone లేటెస్ట్ మోడల్స్‌కి కేరాఫ్‌గా మారనున్న ఇండియా
దీంతో 2022వ సంవత్సరంలో ఆ దేశ ఆర్థిక వృద్ధి రేటు 3 శాతానికి పడిపోయింది. ఇది.. గడచిన అర్ధ శతాబ్ధంలో 2వ అత్యల్ప విలువ కావటం గమనించాల్సిన అంశం. చైనా వార్షిక స్థూల దేశీయోత్పత్తి.. అంటే.. జీడీపీ.. గతేడాది దాదాపు 17 పాయింట్ తొమ్మిదీ నాలుగు ట్రిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇది.. ప్రభుత్వ లక్ష్యమైన 5 పాయింట్ 5 శాతం కన్నా తక్కువని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ అనే సంస్థ తెలిపింది.
జీరో కొవిడ్ విధానంలో భాగంగా లాక్‌డౌన్లను పదే పదే అమలుచేయటం వల్ల మొదటికే మోసం వచ్చింది. అదే సమయంలో.. అధికార కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద పెద్ద పారిశ్రామిక సంస్థల పట్ల కఠినంగా వ్యవహరించటం సైతం తీవ్రంగా దెబ్బకొట్టింది. చైనా గ్రోత్ రేట్ 1974వ సంవత్సరంలో 2 పాయింట్ 3 శాతంగా నమోదైంది.
ఇదే ఇప్పటివరకు ఆ దేశ చరిత్రలో అతి తక్కువ వృద్ధి రేటు. చైనా జీడీపీ 2021లో 18 ట్రిలియన్ యూఎస్ డాలర్లు కాగా 2022లో 17 పాయింట్ తొమ్మిదీ నాలుగు డాలర్లకు పడిపోయింది. చైనా కరెన్సీతో పోల్చితే అమెరికా కరెన్సీ విలువ భారీగా పెరగటం దీనికి కారణం.