ఎవరికి ఏం కావాలో దానిని అందించడమే సోనూసూద్ లక్ష్యంగా ఇప్పుడు మారిపోయింది. శుష్క వాగ్దానాలకు, రాజకీయ విమర్శలకు తావు ఇవ్వకుండా సోనూసూద్ తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దాంతో ఇవాళ దేశ వ్యాప్తంగా ఎవరికి ఏ సమస్య వచ్చినా సోనూ సూద్ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. నిన్న బెంగళూరులోని ఓ హాస్పిటల్ కు కొద్ది గంటల వ్యవథిలోనే ఆక్సిజన్ ను సరఫరా చేసి దాదాపు పాతిక పైగా ప్రాణాలను కాపాడిన సోనూసూద్ బృందం ఇప్పుడు ఆక్సిజన్ అవసరమైన హాస్పిటల్స్ కు దానిని అందించే పనిలో పడింది. ఏదో ఒక పని చేసుకుంటూ వెళ్లడం కాకుండా… అవసరమైన వారికి అత్యవసరంగా దానిని అందించడమే సోనూసూద్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇవాళ దేశంలో ఆక్సిజన్ కొరతను గుర్తించిన ఆయన, ఆయన బృందం దానిని ట్రక్కుల్లో హాస్పిటల్స్ కు పంపే పనిలో రేయింబవళ్లు కృషి చేస్తోంది. దానికి సంబంధించిన ఓ చిన్న వీడియోను సోనూసూద్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి, ‘స్టే స్ట్రాంగ్ ఇండియా, ఆక్సిజన్ ఫ్రమ్ మై సైడ్ ఆన్ యువర్ వే’ అంటూ బాధితులకు ఊరటను కల్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ పేండమిక్ సిట్యుయేషన్ లో ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న సోనూసూద్, అతని బృందాన్ని అభినందించాలి.