కరోనా విలయం సృష్టించింది.. మరోసారి ఉగ్రరూపం దాల్చి ఎటాక్ చేస్తోంది.. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బకొట్టింది.. సామాన్యులు జీవనమే కష్టంగా మారిపోయింది.. అయితే, ఈ సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కీలక సూచనలు చేశారు బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి.. ఏ విషయం అయినా కుండ బద్దలు కొట్టినట్టుగా.. సూటిగా మాట్లాడే ఆయన.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఈ సమయంలో మీరు ఆర్థిక మంత్రిగా ఉండి ఉంటే ఏం చేసేవారు? అనే ప్రశ్న ఎదురైంది.. దీనిపై స్పందించిన స్వామి.. మొదటగా పన్ను వసూళ్లను రద్దు చేస్తానని.. ఏప్రిల్ 1 నుంచి ఇది దేశ వ్యాప్తంగా వర్తిస్తుందని ప్రకటిస్తానని.. సాధారణ పరిస్థితులు నెలకొనేవరకు అది కొనసాగిస్తానని.. అంతేకాదు.. దానిని శాశ్వతంగా కొనసాగించడంపై కూడా ఆలోచిస్తానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాజ్యసభ సభ్యులు.
తాను బీజేపీ అధికారంలోకి వచ్చిన మొదట్లోనే ఎన్నో సలహాలు ఇచ్చినట్టు గుర్తుచేసుకున్నారు సుబ్రమణ్యస్వామి.. ఐటీ ఆదాయ పన్ను ద్వారా ప్రభుత్వానికి దాదాపు 4 లక్షల కోట్ల ఆదాయం వస్తుందన్న ఆయన.. అదే బడ్జెట్ చూసుకుంటే దాదాపు 8-9 లక్షల కోట్ల మధ్య ఉంటుందన్నారు.. అంతే కాదు ఆదాయపన్నే కాకుండా.. ప్రత్యామ్నాయ మార్గాల్లో కూడా వనరులు పెంచుకోవచ్చని కూడా చెప్పానని ఈ సందర్భంగా నెమరువేసుకున్నారు. ఇక, ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలో పడితే చాలు.. ప్రజలు వాళ్లంతట వాళ్లే పన్నులు చెల్లిస్తారని తెలిపారు.. ఇప్పుడు సుబ్రమణ్యస్వామి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.