ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే లక్షలు. తరువాత కోట్లు. ఇప్పుడు వందల కోట్లు! మన సినిమాల్లో క్వాలిటీ, క్రియేటివిటి కోసం దర్శకనిర్మాతలు ఎంత వెచ్చిస్తారన్నది పక్కన పెడితే… రెమ్యూనరేషన్స్ కోసం బాగానే డబ్బులు వెదజల్లుతారు! లెటెస్ట్ గా దిల్ రాజు, వంశీ పైడిపల్లి, తమిళ స్టార్ హీరో విజయ్ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన సినిమా గురించి అటువంటిదే ఓ టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం గ్లామర్ ప్రపంచంలో రెమ్యూనరేషన్స్ ఏ రేంజ్ లో ఉంటున్నాయో ఈ విషయం వింటే తెలిసిపోతుంది…
ఇళయదళపతిగా ఫ్యాన్స్ పిలుచుకునే విజయ్ కి డిమాండ్ ఎంత ఉంటుందో మనం ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు! తమిళనాడులో ఆయనకు విపరీతమైన క్రేజ్. తెలుగులో అంత స్థాయిలో లేకున్నా ఇక్కడ కూడా విజయ్ ని ప్రేక్షకులు బాగానే గుర్తుపడతారు. అందుకే, ఆయన 66వ సినిమాని బైలింగ్యువల్ గా దిల్ రాజు నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందే వంశీ పైడిపల్లి డిరెక్టోరియల్ కోలీవుడ్, టాలీవుడ్ రెండు చోట్లా ఆసక్తి రేపుతోంది. అందులోని ప్రధాన కారణాల్లో ఒకటి చెన్నై స్టార్ హీరో రెమ్యూనరేషన్!
ఇళయదళపతి విజయ్ కి మన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు వంద కోట్లు ఫీజు చెల్లించనున్నాడట! ఇప్పటికే పది కోట్లు టోకన్ అడ్వాన్స్ ఇచ్చాడని టాక్. మిగతా మొత్తం విడతల వారీగా చెల్లిస్తారు. అయితే, వంద కోట్లు చాలా పెద్ద అమౌంట్ అయినా హీరో విజయ్ కి తమిళనాడులో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందుకే, నిర్మాతలు ఎంతైనా ఇవ్వటానికి సై అంటుంటారు. అలాగే, వంశీ పైడిపల్లి డైరెక్షన్ కారణంగా సినిమాకి తెలుగులోనూ మంచి కలెక్షన్స్ ఉంటాయి కాబట్టి భారీ రెమ్యూనరేషన్ మామూలు విషయమే. అయితే, ‘విజయ్ 66’ సినిమా స్టార్ట్ కావటానికి కొంత సమయం పడుతుంది. ప్రస్తుతం తమిళ స్టార్ హీరో నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో తన 65వ చిత్రం చేస్తున్నాడు. అది ఈ సంవత్సరం చివర్లోగానీ, వచ్చే యేడు మొదట్లో గానీ రిలీజ్ అవ్వొచ్చు. ఆ సినిమా షూటింగ్ పూర్తైన వెంటనే వంశీ పైడిపల్లి, దిల్ రాజు మూవీకి విజయ్ పచ్చ జెండా ఊపవచ్చు!