NTV Telugu Site icon

డాక్టర్ అవతారం ఎత్తిన వైసీపీ ఎమ్మెల్యే రోజా

చిత్తూరు జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా యాక్టర్‌, పొలిటీషియన్‌గానే కాదు.. డాక్టర్‌గానూ తన సేవలందిస్తున్నారు. పుత్తూరు మండలం గొల్లపల్లి గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం నాడు ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్యశిబిరాన్ని ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించడం కోసం ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ శిబిరంలో ఎమ్మెల్యే మెడలో స్టెతస్కోప్ వేసుకుని పలువురికి బీపీ, షుగర్ టెస్టులను స్వయంగా నిర్వహించారు.

Read Also: ఆదిత్య బిర్లా కంపెనీతో 2వేల ఉద్యోగాలు: సీఎం జగన్

ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. సీఎం జగన్ ఆరోగ్యశ్రీ పథకం కింద కరోనాతో సహా 2వేల జబ్బులను తీసుకువచ్చి ఉచితంగా వైద్యం అందిస్తున్నారని తెలిపారు. ఆరోగ్య శ్రీ కింద అవసరమైన శస్త్రచికిత్సలు కూడా ఉచితంగా చేసేలా చర్యలు తీసుకున్నారని గుర్తుచేశారు. కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో నిత్యావసరాలను కూడా ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తున్న మనసున్న సీఎం జగన్ అని కొనియాడారు. ప్రతి పంచాయతీలో అనారోగ్యంతో ఉన్నవారికి ఉచితంగా వైద్య పరీక్షలు అందించాలన్నది సీఎం జగన్ లక్ష్యమన్నారు. దీంతో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించి ఉచితంగా మందులను అందిస్తున్నామని రోజా తెలిపారు.