పుట్టిన గడ్డ రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు యశోద హాస్పిటల్స్ గ్రూపు యాజమాన్యం. తమ మాతృభూమి అయిన మేడిపల్లి-రాంపూర్ గ్రామాల్లో రూ 1.50 కోట్లతో ఫంక్షన్‌హాల్, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ను అందుబాటులోకి తెచ్చారు. తల్లి పేరుతో మొదలుపెట్టిన యశోద హాస్పిటల్స్ గ్రూపు తెలుగు రాష్ర్టాల్లో ప్రముఖ వైద్య సేవల కేంద్రంగా నిలిచింది. ఈ సంస్థ వ్యవస్థాపకులు గోరుకంటి రవీందర్‌రావు, గోరుకంటి సురేందర్‌రావు, గోరుకంటి దేవేందర్‌రావులు సొంతూరికి ఏదైనా చేయాలనే తపనతో ఒక్కొక్కటిగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు.
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మేడిపల్లి-రాంపూర్ వీరి సొంతూరు. ఆరేళ్ళ క్రితమే కోటి రూపాయల విలువైన స్థలాన్ని పంచాయతీకి అందజేశారు. ఈ క్రమంలో ఊరికి అవసరమైన వాటిని నిర్మించే పనిలో నిమగ్నమయ్యారు. యశోద ఛారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.1.50 కోట్లతో యశోద సేవా కేంద్రాన్ని నిర్మించారు. మెగా ఫంక్షన్ హాల్-స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఇందులో ఉన్నాయి. అందరూ వినియోగించుకునేలా వీటిని తీర్చిద్దారు. దీనిని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించి అందుబాటులోకి తెచ్చారు.
ఈ సేవలన్నీ పూర్తిగా ఉచితం. గ్రామ ప్రజలకు, చుట్టుపక్కల గ్రామాల వారికి, కమ్యూనిటీలకు, నిరుద్యోగులు, అనాథలు, యువతకు ఉపాధి అవకాశాలు పెంచడంకోసం ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. యశోద ఛారిటబుల్ ఫౌండేషన్ ఎందరో అనాథ, నిరుపేద యువతకు అండగా నిలిచి వారికి అవసరమైన వృత్తిపరమైన – సామాజిక నైపుణ్యాలలో శిక్షణ ఇచ్చి వారు సమాజంలో ఆత్మవిశ్వాసంతో ఎదగడానికి ఈ కేంద్రం చాలా దోహదపడుతుందని అన్నారు.
ఇక్కడ ప్రధానంగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఉంది. కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ పొందితే మెరుగైన ఉపాధి అవకాశాలు పొందేలా ఇక్కడ సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేశారు. గ్రామ ప్రజలతోపాటు చుట్టుపక్కల గ్రామాల వారికి, అన్ని వర్గాల వారికి, నిరుద్యోగులకు, అనాథలకు, యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఇక్కడ ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. దీంతో పాటు మేడిపల్లి-రాంపూర్‌లో ప్రజలకు పూర్తిస్థాయిలో హెల్త్ క్యాంప్ నిర్వహించేందుకు కూడా ఫౌండేషన్ సన్నాహాలు చేస్తోంది.