ముచ్చింతల్ లోని శ్రీరామానుజుల విగ్రహ ప్రాంగణానికి వీఐపీల తాకిడి ఎక్కువయింది. సమసమాజ నిర్మాత శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ధి ఉత్సవాల ఏర్పాట్లు శంషాబాద్ మండలం ముచ్చింతల్ చినజీయర్‌స్వామి ఆశ్రమంలో వేగంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ మేరకు ముచ్చింతల్‌లో ఫిబ్రవరి 5వ తేదీన నరేంద్రమోదీ పర్యటన ఖరారైనట్లు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఆశ్రమానికి సమాచారం అందింది.
రూ.వెయ్యి కోట్లతో రూపుదిద్దుకుంటున్న 216 అడుగుల పంచలోహ విగ్రహాన్ని ఫిబ్రవరి 5వ తేదీన ప్రధానమంత్రి ఆవిష్కరిస్తారు. ఈ ప్రాంతాన్ని ప్రపంచ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడి ప్రధాన మందిరంలో 120కిలోల బంగారంతో రూపొందిన 54అంగుళాల రామానుజుల నిత్యపూజామూర్తిని 13న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తొలిదర్శనంతో ప్రారంభిస్తారు. 35ఎకరాల్లో 144యాగశాలల నిర్మాణం పూర్తిచేశారు. 1035 కుండ శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు, 108 దివ్యదేశ ప్రతిష్ఠ, కుంభాభిషేకములు స్వర్ణ శ్రీరామానుజ ప్రతిష్ఠ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ప్రపంచంలోనే కూర్చున్న భంగిమలో ఉన్న అత్యంత ఎత్తు ఉన్న పంచలోహ విగ్రహంగా శ్రీరామానుజుల విగ్రహం తన విశిష్టతను చాటుకోనుంది. పల్లవ, చోళ, చాళుక్య, కాకతీయ, విజయనగర నిర్మాణ శైలులను 2700 శిల్పులు ఈరాతి కట్టడాన్ని సిద్ధం చేశారు. విగ్రహం 108అడుగులు ఉండగా దిగువన భద్రవేదిక 54అడుగులు, పద్మపీఠం 27అడుగులు, స్వామిచేతిలోని త్రిదండం 27అడుగుల ఎత్తు ఉన్నాయి. విగ్రహం బరువు 1800టన్నులు. విగ్రహ ఆవిష్కరణ సమయం దగ్గర పడుతుండటంతో చినజీయర్‌స్వామి ఆశ్రమానికి వీఐపీల తాకిడి ఎక్కువైంది. ఆశ్రమంలో ఘనంగా గోపూజ నిర్వహించారు. పూజలో పాల్గొన్నారు తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, వి.శ్రీనివాస్ గౌడ్, ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రాంగణంలో నిర్మిస్తున్న రోడ్లను, ఏర్పాట్లను పరిశీలించారు మంత్రులు. సంక్రాంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు రాష్ట్ర మంత్రులు, చినజీయర్ స్వామి, రామేశ్వర రావు, వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు.