హాకీ..!! పేరుకే నేషనల్ గేమ్… ఆడేవాళ్లు కరువు. ఆదరణ అసలే ఉండదు. నాలుగేళ్లకోసారి ఒలింపిక్స్ వస్తే కానీ.. గుర్తుకు రాని గేమ్. హాకీ గ్రౌండ్స్ ఉండవు… హాకీ లీగ్స్ జాడలేదు. హాకీ వైపు వచ్చే క్రీడాకారులు ఒకరిద్దరే. వాళ్లూ కొన్ని రోజులే. మనది కాని గేమ్స్‌కి యమ క్రేజ్…!! కానీ జాతీయ క్రీడాను ఎందుకు పట్టించుకోరు. లోపం ఎక్కడుంది..?
ఇండియా నేషనల్ గేమ్.. హాకీ..! అవును కదా..? అనుకునే రోజులివి. హాకీ జాతీయ క్రీడ అని కూడా చాలామంది మరచిపోతున్నారు. అలాంటి దుస్థితిలో ఉంది క్రీడారంగం. మనది కాని గేమ్ క్రికెట్‌కి ఇండియాలో క్రేజ్ మాములుగా లేదు. ఇండియా ఆడకపోయినా…వేరే దేశాల మధ్య మ్యాచులు జరుగుతున్నా… టీవీలకు అతుక్కుపోయి చూసే క్రికెట్ లవర్స్ కోట్లలో ఉన్నారు. ఇక ఇండియా మ్యాచులుంటే.. పెద్ద పండగే. ఆడే వాళ్లకే కాదు… ఆటను చూసే వాళ్లకు… ఆటను నమ్ముకున్న వాళ్లకూ డబ్చే డబ్బు. మజాకి మజా… మనీకి మనీ. వేరే ఏ గేమ్ ఇవ్వని కిక్ క్రికెట్ ఇస్తుండటంతో… ఏటా క్రేజ్ పెరుగుతోంది తప్ప తగ్గేదే లే.
క్రికెట్‌కి ఉన్నంత ఆదరణ ఇండియాలో ఏ గేమ్‌కీ లేదు. రాదేమో కూడా. ఒలింపిక్స్‌లో సైనా, పీవీ సింధు వంటి క్రీడాకారుల విజయాల తర్వాత… ఇప్పుడిప్పుడు కొంతమంది చూపు బ్యాడ్మింటన్‌పై మక్కువ పెంచుకున్నారు. కొందరు ఆటవిడుపుగా ఆడుతున్నారు కానీ.. ఫుల్‌టైంగా బ్యాడ్మింటన్‌లో రాణించాలని వస్తున్న వారిని వేళ్లపై లెక్కించొచ్చు. ఈ క్రేజ్ కూడా ఒలింపిక్స్ ఉన్నన్ని రోజులే. మళ్లీ సింధు పేరో.. సైనా పేరో.. వినిపిస్తే కానీ రాకెట్స్ గుర్తురావు.
బ్యాడ్మింటన్‌కి వస్తున్న ఆదరణ చూసి… ఐపీఎల్ తరహాలో.. పీబీఎల్.. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ కండక్ట్ చేసినా.. క్లిక్ అవలేదు. స్పాన్సర్లే నిండా మునిగారు. అట్రాక్షనే తప్ప ఆదరణ కాదని అప్పటికి కానీ అర్థం కాలేదు. క్రికెట్, బ్యాడ్మింటన్ మినహా… వేరే ఏ గేమ్‌కి ఆసక్తి చూపరు. ఇక హాకీ సంగతి చెప్పనక్కర్లేదు. ఇదేదే వేరే దేశం ఆట… మనకెందుకు లే అనుకునే వాళ్లూ ఉన్నారు. ఆడటానికి కాదు.. కనీసం చూడటానికి కూడా ఆసక్తి చూపరు. అలాంటిది పిల్లలను హాకీ వైపు పేరెంట్స్ ప్రోత్సహిస్తారు అనుకోవడం అత్యాశే అవుతుంది. ఇందుకు కారణం ముమ్మాటికీ ప్రభుత్వాలే. హాకీని ప్రోత్సహించేలా ఏవైనా చేశారా అంటే.. శూన్యమనే చెప్పుకోవాలి.
ప్రత్యేకంగా హాకీకి కోర్టులుండవు… ఉన్న కోర్టులు కూడా ధ్వంసమైనా పట్టించుకోరు. ఒకే కోర్టులో… ఫుట్ బాల్, హాకీ, బాస్కెట్ బాల్ ప్రాక్టీస్ చేసుకుంటున్న పరిస్థితులూ ఉన్నాయి.
జాతీయ క్రీడగా హాకీని గుర్తించిన దేశం… దాన్ని అభివృద్ధి చేయాలన్న అంశాన్ని మాత్రం పట్టించుకోవు. గేమ్ పై అవగాహన కల్పించడం… ప్రభుత్వ పాఠశాలల్లో హాకీ కోర్టులు ఏర్పాటు చేసి విద్యార్థులను హాకీ వైపు మళ్లేలా చేయడానికి సుముఖత చూపరు. హాకీలో ఎలాంటి అవకాశాలు ఉంటాయి… ఓ క్రీడాకారుడికి ఎలాంటి గుర్తింపు వస్తుంది.. స్పోర్ట్స్ కోటాలో ఉండే ఉద్యోగాలు వంటి వాటిపై అవగాహన కల్పించినా.. హాకీ వైపు ఆసక్తి చూపుతారు. ఇలాంటివి ఏ ప్రభుత్వమూ చేయదు. నాలుగేళ్లకోసారి ఒలింపిక్స్ వస్తే కానీ.. హాకీ గుర్తు రాదు. పతకం సాధిస్తే…రెండ్రోజులు పాటు పొగడ్తల వర్షం కురిపిస్తారు. క్రీడాకారులకు నజారానా ప్రకటించారు. అక్కడితో ప్రభుత్వాలు చేతులు దులిపేసుకుంటున్నాయ్. గ్రౌండ్ లెవల్ నుంచి హాకీని అభివృద్ధి చేయాలన్న అంశం గురించి ఏ ఒక్కరు పట్టించుకోరు.
ఏ ఆటకైనా కమర్షియల్ రంగులద్దడం ముఖ్యం. హాకీలో టీం ఇండియాకి ఆడిన ఆటగాళ్లకు…ఇప్పటికీ సరైన గుర్తింపు దక్కకపోవడం దురదృష్టకరం మాజీ ప్లేయర్స్ వాపోతున్నారు. ఒక్క ఏడాది ఐపీఎల్ ఆడితే చాలు…ఆ ఆటగాడి లైఫ్ టర్న్ ఐపోతోంది. ఒక్కసారి ప్రూవ్ చేసుకుంటే… ఇక తిరుగే ఉండదు. పోనీ.. ఒక్క సీజన్ ఆడినా మినిమమ్ 5 కోట్ల రూపాయలు వెనకేసుకోవచ్చు. కానీ.. హాకీలో రూపాయి పుట్టే పరిస్థితులు లేవు అంటున్నారు మాజీ నేషనల్ ప్లేయర్స్. టీం ఇండియాకి ఆడిన వాళ్లకే గుర్తింపు లేనప్పుడు… ఇక పేరెంట్స్ తమ పిల్లలను ఎలా హాకీ వైపు ఎంకరేజ్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్‌తోపాటు ఆయా జిల్లాల్లో ఉన్న మున్సిపల్ గ్రౌండ్స్‌ని యుటిలైజ్ చేసుకోవాలని అంటున్నారు స్పోర్ట్స్ ఎక్స్‌పర్ట్స్. గ్రౌండ్స్ లేదా స్టేడియం ఇంటికి కనీసం 5 కిలోమీటర్ల లోపున్నా… పిల్లలు గ్రౌండ్ కి వెళ్లడం, ఆటలపై మక్కువ చూపడం వంటివి చేస్తారని అభిప్రాయపడుతున్నారు. పలు నగరాల్లో గ్రౌండ్స్ చాలా ఉన్నా.. నిరుపయోగంగా ఉన్నాయని.. వాటిని వాడుకలోకి తేవాలని కోరుతున్నారు.
కమర్షియల్ టచప్ ఇస్తే కానీ… ఇండియాలో హాకీకి మంచి రోజులు వచ్చే అవకాశం లేదంటున్నారు. కనీసం ప్రభుత్వ పాఠశాలల్లో ఐనా… హాకీ వైపు విద్యార్థులను మళ్లించడం, జూనియర్ లెవల్ టోర్నీలు నిర్వహించి ప్రోత్సహించడం వంటివి చేయాలని కోరుతున్నారు.