తెలంగాణలో వరి వేయవద్దని ప్రత్నామ్నాయ పంటలు వేయాలని స్వయంగా కేసీఆర్, మంత్రులు పదే పదే చెవిలో ఇల్లు కట్టుకుని చెబుతూనే వున్నారు. అయితే రైతులు మాత్రం చాలా చోట్ల వరి వైపే మొగ్గు చూపుతున్నారు. వరిపంట వేయవద్దని ప్రభుత్వం ఆదేశించినా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రైతులు వరినాట్లు వేసేందుకు సిద్ధం కావడం చర్చనీయాంశం అవుతోంది.
ప్రత్యామ్నాయ పంటలపై ప్రభుత్వం ప్రకటన చేసింది తప్ప ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహనా కల్పించడం లేదని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. ప్రత్యామ్నాయం గురించి చెప్పే మంత్రులు సైతం ఆయా పంటలకు సంబంధించిన విత్తనాలను కూడా అందుబాటులో ఉంచడంలేదని రైతులు మండిపడుతున్నారు. వరి స్థానంలో వేరే పంటలు వేస్తే లాభం ఉంటుందని ప్రభుత్వం చెబుతున్నా, వరిపంటకి అసలు ప్రత్యామ్నాయం లేదని రైతులు చెబుతున్నారు.
వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయ పంటలపై ఒక పాలసీని తీసుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు. రెండు ప్రభుత్వాలకు రైతులపై చిత్తశుద్ధి లేదని రైతులు తమ గోసను వెళ్లబోసుకుంటున్నారు. ఈ విషయంలో బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలను కాంగ్రెస్ టార్గెట్ చేస్తోంది. టీఆర్ఎస్ బీజేపీ ఆడుతున్న ఆధిపత్య డ్రామాలో అంతిమంగా నష్టపోతున్నది రైతులే. కళ్ళాల దగ్గర రైతులు గుండెపోటుకి గురవుతున్నారు.
రైతుల్లో వరి పండించేదానిపై ఒక స్పష్టత లేదు. అసలు వరికి సమానమయిన, మంచి ఆదాయాన్ని ఇచ్చే ప్రత్యామ్నాయ పంటలపై వారికి అవగాహన లేదు. ప్రభుత్వం, వ్యవసాయ శాస్త్రవేత్తలు చొరవ తీసుకుని ప్రత్యామ్యాయ పంటలపై ఒక క్లారిటీ ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. రైతులు వరివేయవద్దని చెబుతున్న నేతలు తమ పొలాల్లో ప్రత్యామ్నాయ పంటలు ఏం వేస్తున్నారో క్షేత్రస్థాయిలో చూపించాల్సి వుంది. తాజాగా ఇవాళ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్‌పై బాంబు పేల్చారు. రైతుల్ని వరి వేయవద్దని చెబుతున్న సీఎం కేసీఆర్, ఆయన బంధువులు తమ ఫాం హౌస్ లో వందల ఎకరాల్లో పండిస్తున్నది వరి అంటూ ఫోటోలు విడుదల చేశారు.
అంతేకాదు ఛత్తీస్ ఘడ్ రావాలని హరీష్ రావు, కేటీఆర్‌కి సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. వరి కాకుండా ఇంకో పంట సాగు చేస్తే… ఎకరాకు 9 వేల సాయం చేస్తుంది ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం. మీరిద్దరూ వస్తే అక్కడి సీఎంతో మాట్లాడి అతిథిగా తీసుకెళ్తానన్నారు. సీఎం కెసిఆర్ పండించిన పంట ఎవరు కొంటున్నారు? ఎంతకు కొంటున్నారు అనేది కూడా చెబుతానన్నారు రేవంత్. పండింది తాలా.. గట్టి ధాన్యమా అని కూడా చూపిస్తానన్నారు రేవంత్ రెడ్డి. త్వరలో ఛత్తీస్ ఘడ్ కి మీడియా వాళ్ళను తీసుకెళ్తానన్నారు రేవంత్ రెడ్డి. వరికి ప్రత్యామ్నాయం విషయంలో ప్రభుత్వం రైతుల్ని చైతన్య పరచాల్సిన ఆవశ్యకత వుంది. ఏ పంట వేస్తే ఎన్నిరోజుల్లో కోతకు వస్తుంది? ఆ ప్రత్యామ్నాయ పంటకు మార్కెటింగ్ సౌకర్యం ఎలా వుందో తెలియచేయగలిగితే రైతులు వరిని వదిలి వేరే పంటలపై ఫోకస్ పెడతారు.