తెలంగాణలో రోజు రోజుకు డ్రంకెన్ డ్రైవ్ వల్ల ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. జల్సాల కోసం మద్యం సేవించి రోడ్లపై వాహనాలు నడుపుతూ ఎంతో మంది జీవితాలను బలిగొంటున్నారు. కుటుంబాలకు పెద్దదిక్కైన వారు ప్రమాదాల్లో చిక్కుకోవడంతో వారినే నమ్ముకున్న వారి జీవితాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. అయితే డ్రంకెన్ డ్రైవ్ ప్రమాదాలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రమాదాల నివారణకు త్వరలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు.
పోలీసులు, ఎక్సైజ్, వైద్య నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అంతేకాకుండా బార్లు, పబ్‌లు నిబంధనలు అతిక్రమిస్తే పర్మినెంట్‌గా సీజ్ చేస్తామని శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. తాగి డ్రైవ్ చేస్తూ ప్రమాదాలకు పాల్పడితే కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.