మెదక్ జిల్లాలో వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో హావేలి ఘనపూర్ మండలం బొగుడ భూపతిపూర్‌లో ఇటీవల సీఎం కేసీఆర్‌కు లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న రైతు రవి కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. ఆత్మహత్య చేసుకున్న రవి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. రైతు భూమిని నమ్ముకొని వ్యవసాయం చేస్తారు.. రైతు గుండె ఆగిపోయేలా చేస్తున్నారు కేసీఆర్ అంటూ విమర్శించారు. అంతేకాకుండా వడ్లు వేయాల్సిన రైతు ఉరి ఎందుకు వేసుకుంటున్నారని, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ది నియంత పాలన అని ఆరోపించారు.
ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆదుకోవడం లేదు. కుటుంబాలను పోషించలేని స్థితిలో రైతులున్నారు. ధాన్యం కుప్పల మీద రైతులు చనిపోయే దౌర్భాగ్య స్థితి తెలంగాణ లో ఉంది. తెలంగాణలో 30 మంది రైతులు చనిపోయారు. రైతు రవి సీఎం కేసీఆర్ కు లెటర్ రాసి చనిపోవడం బాధాకరం. వరి వేసుకోకపోతే ఊరే వేసుకోవాలని బాధపడి రైతు రవి లెటర్ రాశాడు. ఆఖరి గింజ వరకు కొంటా అని సీఎం కేసీఆర్ మాట ఇచ్చారు. ప్రభుత్వాలే మాట తప్పుతున్నాయి. బంగారు తెలంగాణ అన్నాడు… మద్దతు ధర ప్రకారం వరి కొనాల్సిందే అని ఆమె డిమాండ్ చేశారు. పంట పండించడం వరకే రైతు బాధ్యతని, మద్దతు ధర రైతు హక్కుఅని ఆమె అన్నారు. వరి వద్దన్నా సీఎం మనకు వద్దు అంటూ ఆమె వ్యాఖ్యానించారు. రవి కుమార్ కుటుంబం దయనీయ స్థితిలో ఉందని, తల్లిదండ్రులకు పెన్షన్ రావడం లేదని, కొడుకు ఆరోగ్యం బాగాలేదని మెడికల్ ఖర్చు అవుతుందని.. రవిది ప్రభుత్వ హత్య అంటూ ఆమె తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు.