సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్‌ను బదిలీ చేసింది ప్రభుత్వం… వినూత్న తరహాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు.. ఆయన వరంగల్ సీపీగా ఉన్న సమయంలో యాసిడ్ దాడి చేసిన కేసులో నిందితుల ఎన్‌కౌంటర్, ఆ తర్వాత సంచలనం సృష్టించిన దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌లో సజ్జనార్ పేరు మారుమోగింది.. తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు.. మూడేళ్లకు పైగా సైబరాబాద్ సీపీగా సేవలు అందిస్తున్న సజ్జనార్.. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులతో కలిసి.. కరోనా, ట్రాఫిక్, ఇతర సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అయితే, ఉన్నట్టుండి ఆయనను బదిలీచేసింది తెలంగాణ సర్కార్… తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమిస్తూ సీఎస్ సోమేష్ కుమార్ ఉత్వర్వులు జారీ చేశారు. ఇక, సజ్జనార్ స్థానంలో సైబరాబాద్ కమిషనర్‌గా 1999 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రను నియమించారు. కానీ, 1996కు చెందిన సజ్జనార్‌ను ఆర్టీసీకి బదిలీ చేయడం వెనుక మతలబు ఏంటి? అనేది తెలియాల్సి ఉంది.