భగత్‌సింగ్.. ఈ పేరు వింటేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయ్.. యువకుల రక్తం మరిగిపోతుంది. ఆయన స్వాతంత్ర్య పోరాట శైలి నేటి యువతకు ఆదర్శం.. ఆయన పోరాట పటిమ నేటి తరానికి స్ఫూర్తి.. భారత దేశపు బానిస సంకెళ్లను తెంచేందుకు భగత్‌సింగ్ ఆయన చేసిన కృషి.. ఉరితాడును ముద్దాడుతూ.. చావు చివరిక్షణంలో కూడా దేశభక్తిని కళ్లలో నిలుపుకున్న ఆ ధీరుడి చరిత్ర గురించి తెలుసుకుందా…
షాహిద్ భగత్‌సింగ్ చరిత్ర..
1907, సెప్టెంబర్ 27న పంజాబ్‌లోని బాంగ్లు గ్రామంలో సాధారణ మధ్యతరగతి కుటుం బంలో జన్మించాడు. తల్లి విద్యావతి, తండ్రి కిసాన్‌సింగ్. తన కుంటుంబీకులు కూడా స్వాతంత్ర్య సమర యోధులు కావడంతో భగత్ వారి అడుగు జాడల్లో నడిచాడు. భగత్ సింగ్ ఆర్యసమాజ్ (ఆధునిక హిందూమతం యొక్క సంస్కరణ విభాగం) చే నిర్వహించబడే దయానంద్ ఆంగ్లో వేదిక్ హైస్కూల్‌లో, లాహోర్‌లో ఉన్న నేషనల్ కాలేజీలో చదివాడు. యువకుడిగా ఉన్నప్పుడే భారతదేశంలో బ్రిటిష్ పాలనపై ఉద్యమించడం ప్రారంభించాడు. మార్క్సిస్ట్ సిద్ధాంతాలను సమర్థించే పంజాబీ- ఉర్దూ-భాషా వార్తాపత్రికలకు అమృత్‌సర్‌లో రచయితగా, సంపాదకుడిగా కూడా పనిచేశాడు. “ఇంక్విలాబ్ జిందాబాద్” అనే నినాదంతో ముందకు సాగాడు.
నవజవాన్ భారతసభ…
తన పాత కళాశాల విద్యార్థు లను కలుపుకుని నవజవాన్ భారతసభను స్థాపిం చాడు. ఆపై నవజవాన్ భారత సభను.. చంద్రశేఖర్ ఆజాద్ స్థాపించిన హిందుస్థాన్ రిపబ్లికన్ ఆర్మీని కలు పుతూ హిందుస్థాన్ సోషలిస్ట్ రివల్యూషన్ ఆర్మీని నెలకొ ల్పారు. 1928లో భారత్‌కు వచ్చిన సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా ఉద్యమించిన లాలా లజ్‌పత్‌రాయ్‌పై స్కౌట్ అనే బ్రిటిష్ పోలీస్ చేసిన లాఠీచార్జీతో నవంబర్ 17న ఆయన చనిపోయాడు. 1928 డిసెంబర్ 17న భగత్‌సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లు శాండర్స్ అనే బ్రిటిష్ పోలీస్ అధికారిని చంపి పోస్టర్లు వేస్తారు. రైతాంగ పోరాటాల అణచివేతకు బ్రిటిష్ ప్రభుత్వం తీసుకువచ్చిన పబ్లిక్ సేఫ్టీ బిల్లుపై ఢిల్లీ సెంట్రల్ అసెంబ్లీలో చర్చకు పెట్టింది.
ఉరితీయాలని ప్రకటించిన ప్రభుత్వం…
దీనికి నిరసనగా 1929 ఏప్రిల్ 8న భగత్‌సింగ్, బటు కేశ్వర్‌దత్తులు ఢిల్లీ సెంట్రల్ అసెంబ్లీలో పొగ బాంబులు విసురుతూ కరప త్రాలు వెదజల్లారు. వీరిని బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. మరోవైపున శాండర్స్ హత్య కేసులో భాగంగా సుఖదేవ్, రాజ్‌గురులనూ అరెస్ట్ చేసి రెండేళ్ల వరకు జైల్లో ఉంచింది. 1931 మార్చి 24న భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ఉరితీయాలని ప్రకటించిన ప్రభుత్వం, దేశవ్యాప్త ఆందోళనకు భయపడి ఒక్కరోజు ముందుగానే అంటే 1931 మార్చి 23న సాయంత్రం 7 గంటలకు ఉరితీసింది. భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్ దేవ్‌లు 23 ఏళ్ల ప్రాయంలో ఉరితాళ్ళను ముద్దాడుతూ, ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ ప్రాణాలు వదిలారు.
ఉరితీసే ముందు భగత్ సింగ్ ఏమన్నాడు?
లాహోర్ జైలు చీఫ్ సూపరింటెండెంట్ మేజర్ పీడీ చోప్రా, ఒక 23 ఏళ్ల యువకునితోపాటు ఆ యువకుని ఇద్దరు స్నేహితులను తీసుకొని నడుచుకుంటూ ఉరికంబం వైపు వెళ్తున్నారు. ఇదంతా చూస్తున్న డిప్యూటీ జైలు సూపరింటెండెంట్ మొహమ్మద్ అక్బర్ చాలా కష్టంగా తన కన్నీళ్లను ఆపుకునేందుకు ప్రయత్నించారు. ఉరికంబం వైపు నడుచుకుంటూ వెళ్తున్న ఆ వ్యక్తి బహుశా అప్పటికే భారత్‌లో ప్రముఖుడిగా మారారు. ఆయనే భగత్ సింగ్. భగత్ సింగ్‌తో పాటు ఆయన స్నేహితులైన సుఖ్‌దేవ్, రాజ్‌గురు కూడా నడుస్తున్నారు. రాజకీయ ఖైదీలుగా వారు ముగ్గురూ జైలుకు చేరారు. తమను సాధారణ ఖైదీల తరహాలో ఉరితీయవద్దని, రాజకీయ ఖైదీలైన తమను కాల్చి చంపాలని వారు ముగ్గురు బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరారు. బ్రిటిష్ ప్రభుత్వం వారి విజ్ఞప్తిని తిరస్కరించింది. వారి ముగ్గురిలో భగత్ సింగ్ మధ్యలో నడుస్తున్నారు. ఆయనకు ఎడమవైపు సుఖ్‌దేవ్, కుడివైపు రాజ్‌గురు ఉన్నారు. ఉరికంబం వైపు నడుస్తూ భగత్ సింగ్ పాట పాడటం మొదలుపెట్టారు. ‘‘ప్రాణం పోయినా నా మనస్సులో దేశంపై ప్రేమ చావదు, మట్టిలో కలిసినా నా శరీరం నుంచి ఈ దేశపు పరిమళమే వస్తుంది’’ అంటూ పాడగా ఆయనతో రాజ్‌గురు, సుఖ్‌దేవ్ స్వరం కలిపారు. ఉరి వేసే ముందు భగత్ సింగ్ ఉరితాడును ముద్దాడారు. ‘‘ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ భగత్ సింగ్’’ పుస్తకంలో సత్వీందర్ సింగ్ ఈ ఘటన గురించి ప్రస్తావించారు.
ఉరితాడును తానే స్వయంగా మెడలో వేసుకున్న షాషిద్ భగత్‌సింగ్…
‘‘ఈ క్షణాన్ని అనుభవించడం కోసమే భగత్ సింగ్ తన జీవితాన్ని దేశానికి ధారపోశారు. ఉరి తాడును స్వయంగా ఆయనే తన మెడలో వేసుకున్నారు. భగత్ సింగ్ తర్వాత రాజ్‌గురు, సుఖ్‌దేవ్ మెడల్లో కూడా ఉరి తాడును వేశారు. ఉరి తాడు మెడలో వేసుకునే ముందు భగత్ సింగ్ దాన్ని ముద్దాడారు. తర్వాత ఆయన చేతులు, కాళ్లను కట్టేశారు’’ అని సత్వీందర్ సింగ్ తన పుస్తకంలో రాశారు. ‘‘వితౌట్ ఫియర్, ద లైఫ్ అండ్ ట్రయల్ ఆఫ్ భగత్ సింగ్’’ అనే పుస్తకాన్ని కుల్దీప్ నయ్యర్ రాశారు. ‘‘ముందుగా ఎవరిని ఉరి తీయమంటారు అని తలారి వారిని అడిగారు. అందరికంటే ముందు నన్ను ఉరి తీయండి అంటూ సుఖ్‌దేవ్ సమాధానం ఇచ్చారు. తలారి ఒకరి తర్వాత ఒకరికి ఉరిని బిగించారు. ముగ్గురి శరీరాలు చాలా సమయం పాటు ఉరికంబానికి వేలాడుతూ ఉన్నాయి’’ అని ఆ పుస్తకంలో కుల్దీప్ రాశారు. దీని తర్వాత వారు ముగ్గురూ మరణించినట్లు అక్కడున్న డాక్టర్ ధ్రువీకరించారు. ఈ ముగ్గురు ఉద్యమకారుల ధైర్యానికి ఎంతో ప్రభావితుడైన అక్కడున్న ఒక జైలు అధికారి, వారి మృతదేహాలను చూడటానికి తిరస్కరించారు. దీంతో వెంటనే ఆయన్ను సస్పెండ్ చేశారు. ఇంకా భగత్‌సింగ్ చిత్రలో చాలా ఘట్టాలున్నాయి……..