ఓ పెద్ద నాయకుడికి ఆయన వారసుడు. మాజీ ఎమ్మెల్యే. ప్రస్తుతం విపక్షపార్టీలో ఉన్నా పెద్దగా చప్పుడు లేదు. కానీ.. తండ్రి వర్ధంతి రోజున సంచలన వ్యాఖ్యలు చేసి.. ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చారు. ఇంతకీ అది వ్యూహమా? నిజంగా ఆయన చెప్పినట్టు జరిగిందా? తన హత్యకు రెక్కీ నిర్వహించారంటూ వంగవీటి రాధాకృష్ణ చేసిన ఆరోపణపై బెజవాడలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తన పని తాను చేసుకుపోయే రాధాను హతమార్చేంత అవసరం ఎవరికి ఉంటుందనేది ఓ ప్రశ్న. రాజకీయంగా ఏదైనా వ్యూహంలో భాగంగా రాధాతో ఎవరైనా ఈ వ్యాఖ్యలు చేయించారా అనేది కూడా ప్రచారంలో ఉంది.
రంగా వర్ధంతి రోజునే ఎందుకీ వ్యాఖ్యలు..?
బెజవాడలో కులాల కుమ్ములాటలు ఎక్కువ. అప్పట్లో వంగవీటి, దేవినేని కుటుంబాల మధ్య వైరం రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపించింది. రెండువర్గాల్లోని ప్రధాన నాయకులు కాలం చేశాక.. ఆ రెండు కుటుంబాల మధ్య అసలు వివాదమే లేదు. రాధా ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. దేవినేని నెహ్రూ వారసుడు అవినాష్ వైసీపీలో కొనసాగుతున్నారు. ఇద్దరూ వేర్వేరు పార్టీలో ఉన్నప్పటికీ వివాదాలు లేవు. మరి.. వంగవీటి రంగా వర్ధంతి రోజున రాధా ఎందుకీ వ్యాఖ్యలు చేశారు.
ఏ పార్టీ వారిపై రాధా ఈ ఆరోపణలు చేశారు?
వంగవీటి రాధా హత్యకు నిజంగానే కుట్ర జరిగిందా? అదే నిజమైతే ఎందుకు ఇప్పటి వరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు? రంగా వర్థంతి రోజునే ఈ విషయాన్ని ఎందుకు చెప్పారు? తనపై ఎవరు రెక్కీ నిర్వహించారో తెలుసన్న ఆయన.. వారెవరో వెల్లడించ లేదు. సమయం వచ్చినప్పుడు ఆ విషయం బయటకు వస్తుందని సస్పెన్స్ పెంచారు. తనకు భయంలేదని.. ప్రజల్లోనే ఉంటానని.. తన హత్యకు కుట్ర చేసిన వారిని ప్రజలు దూరం పెట్టాలని చెప్పటంతో.. ఆ కుట్ర చేసింది రాజకీయ నాయకులనే చర్చ మొదలైంది. ప్రస్తుతం టీడీపీలో ఉన్న రాధా ఏ పార్టీకి చెందిన వారిపై ఈ ఆరోపణలు చేశారో క్లారిటీ రాలేదు.
కొడాలి నాని, వంశీ సమక్షంలో రాధా కామెంట్స్..!
ఒకవేళ హత్యకు కుట్ర చేశారని.. రాధా చేసిన వ్యాఖ్యలు నిజం కాకపోతే.. ఆయన మాటల వెనక ఉన్నదెవరు? మూడుసార్లు మూడు పార్టీల నుంచి బరిలో దిగి.. ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీలో ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో ఎక్కడా పోటీ చేయలేదు. పైగా సంచలన వ్యాఖ్యలు చేసిన రోజునే టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈ మాజీ ఎమ్మెల్యేను కలిశారు. వీరిద్దరూ మంత్రి కొడాలి నానితో కలిసి గుడివాడలో రంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. వంశీ, నాని సమక్షంలోనే తన హత్యకు రెక్కీ జరిగిందని సంచలన రేపారు రాధా.
రెక్కీ నిజామా.. వ్యూహమా?
రాధాను వైపీపీలోకి తీసుకురావాలని మంత్రి కొడాలి నాని ప్రయత్నించినా అది ఆచరణలోకి రాలేదని టాక్. ఇప్పుడు పార్టీ మారేందుకు రాధాతో ఈ వ్యాఖ్యలు ఎవరైనా చేయించారా అనే అనుమానాలు ఉన్నాయట. రాధా చేసిన ఈ కామెంట్స్‌పై టీడీపీ, వైసీపీ నేతలు ఎవరూ స్పందించలేదు. దీంతో రాధా హత్యకు రెక్కీ వ్యాఖ్యలు నిజమా లేక రాజకీయ వ్యూహమా అనే చర్చ సర్వత్రా ఉంది. మరి.. తాజా ఎపిసోడ్‌లోని ఉత్కంఠకు రాధా ఎలా తెరదించుతారో చూడాలి.
