NTV Telugu Site icon

Himachal Pradesh: ఘోర ప్రమాదం.. ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడి ఒకరు మృతి, పలు వాహనాలు దగ్ధం

Himachal

Himachal

హిమాచల్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఉనాలో ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడడంతో ఒకరు మృతి చెందారు. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడిన తర్వాత.. ఆయిల్ కిందకు కారి మంటలు వ్యాపించాయి. దీంతో పలు వాహనాలు, దుకాణాలు కూడా దగ్ధమయ్యాయి. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ ప్రకారం.. హరోలి ప్రాంతంలోని తహ్లివాలా కస్వా గ్రామంలో ఈ సంఘటన జరిగింది. కాగా.. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమించి అదుపులోకి తీసుకొచ్చారు.

కాగా.. ఈ ప్రమాదానికి గల కారణం ట్యాంకర్ బ్రేక్ ఫెయిల్ కావడమేనని అధికారులు చెబుతున్నారు. డీజిల్‌తో కూడిన ట్యాంకర్‌ బ్రేకులు ఫెయిల్‌ కావడంతో మార్కెట్‌లో బోల్తా పడి మంటలు చెలరేగి స్కూటర్‌తో సహా పలు వాహనాలు దగ్ధమై ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన స్కూటర్‌ రైడర్‌ను పంజాబ్‌కు చెందిన సుభాష్‌ చందర్‌గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన ఎనిమిది మందిలో, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని మెరుగైన చికిత్స కోసం ప్రాంతీయ ఆసుపత్రి ఉనాకు రిఫర్ చేశారు.

ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి ముఖేష్ అగ్నిహోత్రి, స్థానిక ఎమ్మెల్యే సంతాపం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు చేపట్టేందుకు అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారని తెలిపారు. మరోవైపు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించి ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులను, క్షతగాత్రులను ఆయన ఓదార్చారు.