ఏపీలో ప్రస్తుతం సినిమా టికెట్ల ధరలు, సినిమా థియేటర్ల మూసివేత హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో నేడు సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో సినిమా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు సమావేశమయ్యారు. సుమారు గంటన్నర పాటు మంత్రి పేర్ని నానితో టికెట్ల ధరలు, థియేటర్ల మూసివేతపై చర్చించి వారి ప్రతిపాదనలు అందించారు.
సమావేశం అనంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. సినిమా హాళ్లలో వసతులు మెరుగుపర్చాలని గతంలోనే చెప్పామని, సమయం ఇచ్చినా మార్పు లేకపోవడంతోనే తనిఖీలు చేశామన్నారు. కనీసం థియేటర్లు రెన్యూవల్ చేయకుండా నడిపిస్తున్నారని ఆయన వెల్లడించారు. అందుకే అనుమతులు లేకుండా నడుపుతున్న థియేటర్లనే సీజ్ చేశామని స్పష్టం చేశారు. అలాగే సినిమా ఇండస్ట్రీ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం పరిశీలిస్తోందని ఆయన తెలిపారు.
అయితే కార్పొరేషన్లలోని ఏసీ థియేటర్లలో గరిష్ఠ ధర రూ.150, కనిష్ఠ ధర రూ. 50, నాన్ ఏసీ థియేటర్లలో గరిష్ఠ ధర రూ. 100, కనిష్ఠ ధర రూ.40, కార్పొరేషన్ మినహా ఏసీ థియేటర్లలో గరిష్ఠ ధర రూ. 100, కనిష్ఠ ధర రూ. 40, నాన్ ఏసీ థియేటర్లలో గరిష్ఠ ధర రూ. 80, కనిష్ఠ ధర రూ. 30 లుగా టికెట్ల ధరలు ఉండాలని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కోరినట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా 4 వారాల సమయం ఇస్తే థియేటర్లు రెన్యూవల్ చేసుకునేలా చర్యలు తీసుకుంటామన్నట్లు ఆయన పేర్కొన్నారు.