NTV Telugu Site icon

ఏపీ ఉద్యోగుల ఆందోళనకు తాత్కాలిక బ్రేక్‌..

పీఆర్సీ, పెండింగ్‌ సమస్య పరిష్కారం ఆంధ్రప్రదేశ్‌లో ఆందోళన బాటపట్టాయి.. 70కి పైగా డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టాయి.. వెంటనే పరిష్కారం చూపాలంటూ ఉద్యమాన్ని చేపట్టాయి.. అయితే, ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతూ వచ్చిన ప్రభుత్వం.. తాత్కాలికంగా ఉద్యోగుల ఆందోళనకు బ్రేక్‌లు వేసింది.. పెండింగ్‌ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఉద్యోగ సంఘాలు తమ ఆందోళనను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించాయి.. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, సీఎస్ సమీర్‌శర్మ, ఆర్థిక శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌.. ఉద్యోగ సంఘాలతో సమావేశమై డిమాండ్ల పరిష్కారంపై చర్చించారు.. రెండు జేఏసీల ప్రతినిధుల బృందం, సచివాలయ ఉద్యోగుల సంఘం, గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ప్రతినిధి బృందంతో చర్చలు సాగాయి.. పెండింగ్‌లో ఉన్న డిమాండ్లను ఉద్యోగ సంఘాలు.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి.

Read Also: మళ్లీ భారీగా పెరిగిన పసిడి ధర

అయితే, పెండింగ్‌లో ఉన్న అన్ని డిమాండ్లు వెంటనే పరిష్కారం అయ్యేవి కావని, అవి సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయంటూ ఉద్యోగ సంఘాలకు వివరించారు మంత్రి బుగ్గన.. ఉద్యోగ సంఘాలతో సమావేశాలు నిర్వహించి చర్చలు జరపడం నిరంతర ప్రక్రియ అని, అది కొనసాగిస్తూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.. ఇక, దీనికి సానుకూలంగా స్పందించిన ఉద్యోగ సంఘాలు.. డిమాండ్లను సాధించుకోవడానికి ఆందోళన చేస్తున్నామని.. క్రమంగా అన్నింటినీ పరిష్కరిస్తామని ప్రభుత్వం చెప్పిన తర్వాత ఆందోళన చేయాల్సిన అవసరం లేదని.. దీంతో తమ ఉద్యమాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నామని ప్రకటించాయి. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా వ్యవహరిస్తున్నాం.. కోవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో కొంత ఆలస్యమైంది. ఉద్యోగ సంఘాల 71 అంశాలను దశల వారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఆర్థికేతర అంశాల పరిష్కారానికి సీఎస్‌ అన్ని విభాగాల సెక్రటరీలతో వచ్చేవారం సమావేశం నిర్వహిస్తామన్నారు. ఇక, మంచి వాతావరణంలో చర్చల ద్వారా సత్ఫలితాలు ఉంటాయి. ప్రభుత్వం అనే కుటుంబంలో ఉద్యోగులు కూడా భాగమే. రెండు జేఏసీల్లోని 9 సంఘాలు చేస్తున్న ఉద్యమాన్ని విరమించాలని కోరామని.. వారు కూడా అంగీకరించారని వెల్లడించారు.