గత రెండు సంవత్సరాలుగా యావత్తు ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తోన్న కరోనా మహామ్మరి కొత్తగా ఓమిక్రాన్ రూపంలో మరోసారి దేశాలను భయపెడుతోంది. దక్షిణాఫ్రికాలో ఈ కొత్త వేరియంట్‌ను గుర్తించిన శాస్త్రవేత్తలు దీని వ్యాప్తి చాలా వేగంగా ఉందని తెలిపారు. అయితే దీనిపై ఇప్పటికే పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. విమాన ప్రయాణాలను సైతం రద్దు చేస్తున్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా సమీక్ష నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వాలు ముందుస్తు చర్యలు తీసుకోవాలని సూచించింది.
దీంతో నేడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన పలు అంశాలపై కేబినేట్ సమావేశం నిర్వహించారు. అయితే ఒమిక్రాన్ ను ఎదుర్కునేందుకు కేబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అయితే కమిటీ చైర్మన్‌గా ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు ఉండనట్లు సమాచారం. అంతేకాకుండా కమిటీలో సభ్యులుగా మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు లతో పాటు సబితా ఇంద్రారెడ్డి ఉండనున్నారు. ఈ కమిటీ ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేయనుంది. దీనిపై కాసేపట్లో కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
