NTV Telugu Site icon

సినీ హీరోలను టార్గెట్‌ చేసిన టీడీపీ ఎమ్మెల్యే.. రియల్ హీరోలుగా మారరా..?

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల వ్యవహారంపై మాటల యుద్ధం నడుస్తూనే ఉంది.. ఓ వైపు ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసి.. సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది.. మరోవైపు.. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు సినీ హీరోలు ఎవరూ ఈ వ్యవహారంపై స్పందించొద్దు అంటున్నారు సినీ పరిశ్రమలోని పెద్దలు.. అయినా అక్కడక్కడ కొంతమంది టికెట్ల ఇష్యూపై స్పందిస్తూనే ఉన్నారు.. ఇదే సమయంలో సినీ పెద్దలపై టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్‌ సీరియస్ కామెంట్లు చేశారు.. రాష్ట్రంలో థియేటర్ల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షమందికి ఉపాధి కలుగుతోందన్న ఆయన.. సినీ పరిశ్రమను సీఎం జగన్ తన వ్యక్తిగత స్వార్థం కోసం బలిపెడుతున్నారని ఆరోపించారు.. తనిఖీల పేరుతో థియేటర్లు మూసేస్తున్నారు.. థియేటర్లలో పనిచేస్తున్న గేట్ మెన్ నుంచి ప్రోజెక్టర్ ఆపరేటర్ వరకు అనేక మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారన్నారు.

Read Also: నువ్వు ఎలాగూ వెళ్లవు… మేం వెళ్తుంటే నొప్పేంటి?.. రేవంత్ ఫైర్‌

ఉచిత ఇసుక రద్దు చేసి వందలాది మంది భవన నిర్మాణ కార్మికులను బలితీసుకున్నట్టు సినీ కార్మికులను బలి తీసుకుంటారా? అని మండిపడ్డారు ఎమ్మెల్యే అనగాని.. ఇక, సినీ రంగాన్ని జగన్ వేధింపులకు గురి చేస్తుంటే సినీ పెద్దలు ఎందుకు నోరు మెదపటం లేదు? అంటూ ఫైర్‌ అయ్యారు.. సినిమాల్లో చూపించే హీరోయిజం సినీ పరిశ్రమను వేధింపులకు గురి చేస్తున్న జగన్ సర్కార్‌పై ఎందుకు చూపించటం లేదు? అని నిలదీసిన ఆయన.. విశాఖలో స్టూడియోలకు గత ప్రభుత్వం భూమి కేటాయిస్తే దానిని వైసీపీ ప్రభుత్వం ఇవ్వకున్నా హీరోలు నోరు మెదపలేదు? రీల్ హీరోలుగానే మిగిలిపోతున్నారు తప్ప రియల్ హీరోలుగా మారరా..? అంటూ సీరియస్‌ కామెంట్లు చేశారు. కావేరి నది జలాల సమస్యపై అక్కడి సినీ పరిశ్రమంతా ఏకతాటిపై వచ్చారు, జల్లికట్టు అంశంపై తమిళ హీరోలంతా స్పందించారు. కానీ, మన రాష్ట్రంలోని సమస్యలపై సినీ పెద్దలు స్పందించటం లేదు అని విమర్శించారు.. సినీ పెద్దలు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా? మీరు సినిమాలు ప్రజలు చూడాలి.. కానీ, వారి కష్టాలు మీకు పట్టవా? అంటూ నిలదీశారు టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్.