కడప జిల్లాలోని బద్వేల్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.. ఇవాళ ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది.. రాత్రి 7 గంటల వరకు కొనసాగనుంది.. అయితే, ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీకి దూరంగా ఉన్నా.. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు బీజేపీ తరపున ఏజెంట్లుగా కూర్చోవడం చర్చగా మారింది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కన్నుమూయడంతో వచ్చిన ఈ ఎన్నికల్లో టీడీపీ తన అభ్యర్థిని పెట్టలేదు.. కానీ, బీజేపీ పోటీకి నిలిచింది.. అయితే, ఆ పార్టీకి సరైన క్యాడర్ కూడా లేదనే విమర్శలు వినిపించాయి.. అత్యధిక పోలింగ్ బూత్‌ల్లో ఏజెంట్లు కూడా దొరకని పరిస్థితి ఉందట.. దీంతో.. టీడీపీ స్థానిక నేతలను, కార్యకర్తలను తమవైపు బీజేపీ తిప్పుకున్నట్టుగా తెలుస్తోంది..
మొత్తంగా ఈ ఎన్నికల్లో టీడీపీ నేతలు కొందరు.. బీజేపీ పోలింగ్ ఏజెంట్లుగా బూతుల్లో కనిపించారు. వాస్తవానికి బద్వేల్ నియోజకవర్గంలో బీజేపీకి నామమాత్రంగా కూడా కార్యకర్తలు లేరనే విమర్శలు ఉన్నాయి.. అయితే, పోటీ చేసి.. చిత్తుగా ఓడితే పరువు పోతుందని భావించిన బీజేపీ.. మిత్రుల సహాయం తీసుకుందని చెబతున్నారు.. దీనికోసం బీజేపీలో చేరిన సీఎం రమేష్, ఆదినారాయణరెడ్డి తదితరుల ద్వారా పావులు కదిపినట్టు ప్రచారం సాగుతోంది.. బీజేపీ నాయకులు వీరితో కలసి స్థానిక టీడీపీ నేతల ఇళ్ల వద్దకు వెళ్లి ఆ పార్టీ క్యాడర్ తమకు మద్దతిచ్చేలా చూడాలని కోరారట… దాని తగ్గట్టుగానే ఇవాళ.. వారు బీజేపీ పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోవడం చర్చగా మారింది. అయితే, ఈ వ్యవహారంపై అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు.. ఎన్నికలకు దూరంగా ఉన్నామంటూ ప్రకటించిన టీడీపీ.. అక్రమ మార్గంలో బీజేపీతో పొత్తు పెట్టుకుందని ఆరోపిస్తున్నారు.. ఇదే, టీడీపీ అధినేత చంద్రబాబు నిజ స్వరూపం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.