NTV Telugu Site icon

అజ్ఞాతంలో టీడీపీ నేత పట్టాభి.. వీడియో విడుదల

తన వ్యాఖ్యలతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించిన టీడీపీ నేత పట్టాభిరామ్‌.. సీఎం వైఎస్‌ జగన్‌పై చేసిన వ్యాఖ్యలకు గాను అరెస్ట్ కావడం, జైలుకు పోవడం.. బెయిల్‌పై విడుదల కావడం అన్నీ జరిగిపోయాయి.. అయితే, ఆ తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.. ఎక్కడున్నారు అనేది తెలియదు. ఇదే సమయంలో.. ఆయన మాల్దీవ్స్‌ వెళ్లారంటూ సోషల్‌ మీడియాలో కొన్ని ఫొటోలు, వీడియోలు రచ్చ చేశాయి.. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వచ్చిన పట్టాభి.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి మాలే వెళ్లారని ప్రచారం జరిగింది. కాగా, ఓ వీడియో విడుదల చేసిన పట్టాభి.. అన్ని పుకార్లకు పులి స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.

Read Also : ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన.. మరోసారి హస్తినకు వెళ్లాలని నిర్ణయం..!

తాను కుటుంబంతో కలిసి బయటకి వచ్చా.. అతి త్వరలో మళ్లీ నేను వచ్చి నా విధి నేను నిర్వహిస్తానంటూ వీడియోలో పేర్కొన్నారు.. తప్పుడు కేసులకు నేను భయపడను అంటూ స్పష్టం చేసిన ఆయన.. నా ఇంటి పై వైసీపీ నేతలు జరిపిన దాడిలో నా కుమార్తె భయ బ్రాంతులకు గురైంది.. ఒక తండ్రిగా నా కుమార్తె బాధ్యత నేను నిర్వర్తిస్తా.. నా కుమార్తె, నా భార్యతో నేను బయటకెళ్తే అనేక అర్ధాలు తీస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నాపై పెట్టిన తప్పుడు కేసులపై న్యాయస్థానాలను ఆశ్రయించనున్నట్టు ఆ వీడియోలో పేర్కొన్న పట్టాభి.. తన ఇంటిపై దాడి, అనంతరం పరిణామాలపై స్పందించారు. పార్టీ జెండాలు బ్యాక్ గ్రౌండ్లో కనపడేలా కూర్చుని వీడియో చేశారు.. కష్ట కాలంలో తనకు మద్దతుఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.. ఇక, జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారి స్పందిస్తూ వీడియో విడుదల చేశారు.. అయితే, తాను ఎక్కడ ఉన్నాననే విషయాన్ని మాత్రం గోప్యంగానే ఉంచారు పట్టాభి.