అఫ్ఘనిస్తాన్ ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు తమ నిజస్వరూపాన్ని ప్రపంచానికి మరోసారి పరిచయం చేస్తున్నారు. తాము చెప్పిందే వేదం.. తాము చేసిందే శాసనం అన్నట్లుగా వారి వ్యవహారశైలి ఉంది. దేశంలోని అమాయక ప్రజలపై మానవమృగాల్లా కంటే దారుణంగా రెచ్చిపోతూ తాలిబన్లు రక్తపుటేరులను పారిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు తమకు సాయం చేయండి మహాప్రభో అంటూ ప్రపంచ దేశాలను వేడుకుంటున్న అప్ఘన్ల అర్తనాదాలు మాత్రం ఎవరికీ విన్పించకపోవడం శోచనీయంగా మారింది.
అప్ఘనిస్తాన్లో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు తాలిబన్ నేతలు ఇప్పటికే ప్రకటించారు. రేపటి నుంచే తాలిబన్లు తమ పాలనను మొదలు పెట్టారు. ఈమేరకు తాలిబన్ నేతలు ఏర్పాట్లు సైతం పూర్తి చేసుకున్నారు. తమ పాలనను ప్రపంచ దేశాలు సైతం గుర్తించాలని తాలిబన్లు కోరుతున్నారు. ఈక్రమంలోనే తాలిబన్లు ప్రపంచ దేశాలు ముందు శాంతి వచనాలు వల్లిస్తున్నారు. అయితే వెనుకలా మాత్రం తమను వ్యతిరేకించే వారిని, మైనార్టీలను వెతికివెతికి మరీ చంపుతున్నారనే వార్తలు విన్పిస్తున్నాయి.
తాలిబన్లను దురాక్రమణను పంజ్ పీర్ ప్రజలు తొలి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఈక్రమంలోనే తాలిబన్లు తమ భూభాగంలోకి రాకుండా పంజ్ పీర్ యోధులు ఏకమై అడ్డుకున్నారు. ఈక్రమంలోనే ఇరువర్గాల మధ్య భీకరపోరాటం నడుస్తోంది. తాలిబన్లపై మొదట పైచేయి సాధించిన పంజ్ పీర్ సైన్యం ఆ తర్వాత క్రమంగా లొంగిపోయినట్లు తెలుస్తోంది. తాలిబన్లకు పాకిస్థాన్ సాయం అందిస్తుండటంతోనే పంజ్ పీర్ సైన్యం వారిని నిలువరించ లేకపోయినట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే పంజ్ పీర్ మొత్తం తమ ఆధీనంలోకి వచ్చిందని తాలిబన్లు ప్రకటిస్తున్నారు. అయితే దీనిని రెసిస్టెంట్ సైన్యం ఖండిస్తుంది. తమ చివరి రక్తపుబొట్టు ఉన్నంత వరకు దేశం కోసం పోరాడుతామని ఈ పోరు కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేసింది.
మరోవైపు పంజ్ పీర్లో ఇప్పటికే పలు ప్రాంతాలను హస్తగతం చేసుకున్న తాలిబన్లు ఇంటింటికి వెళ్లి గాలింపులు చేస్తున్నారు. తమకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారిని, మైనార్టీలను వెతికి మరీ చంపుతున్నారని వార్తలు విన్పిస్తున్నాయి. వీరి నరమేధానికి భయపడి ఇప్పటికే వందలాది కుటుంబాలు పారిపోయినట్లు రెసిస్టెంట్స్ ఫోర్స్ సైన్యం ట్వీటర్లో ఆవేదన వ్యక్తం చేసింది. మహిళలపై తాలిబన్ల ఆఘాయిత్యాలు పెరిగిపోతుండటం ఆందోళనను రేపుతోంది. ఈ వార్తలను కవర్ చేస్తున్న జర్నలిస్టుల పట్ల తాలిబన్లు హేయంగా ప్రవర్తిస్తున్నారు. ఇన్ని దారుణాలకు పాల్పడుతూ తాలిబన్లు పైకి శాంతి వచనాలు వల్లిస్తున్నారు.
ఇప్పటికే దేశం వదిలి వెళ్లిన ప్రభుత్వ అధికారులు తిరిగి రావాలని తాలిబన్లు పిలుపునిస్తున్నారు. అయితే వీళ్లు తిరిగి వెళితే మాత్రం వాళ్లు వదులుతారా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రపంచ దేశాలు తమకు ఎందుకు సాయం చేయడం లేదంటూ అప్ఘన్లు ప్రశ్నలవర్షం కురిపిస్తున్నారు. దీంతో తాలిబన్ల మూకను చూసి ప్రపంచం కూడా భయపడుతుందా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఏదిఏమైనా తాలిబన్లు రేపటి నుంచి అప్ఘన్లో అధికారిక పాలన చేపడుతూ ప్రపంచానికి సవాల్ విసిరినట్లే కన్పిస్తుంది. ఇప్పటికే తాలిబన్ల విషయంలో ప్రేక్షక పాత్ర పోషిస్తున్న ప్రపంచ దేశాలు వారి పాలనను ఏమేరకు అంగీకరిస్తాయో వేచిచూడాల్సిందే..!