ధనాధన్ క్రికెట్‌లో అత్యున్నత పోరుకు రంగం సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి సూపర్-12 మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. టీ 20 ప్రపంచ కప్ టోర్నమెంట్ నేటి నుంచి వచ్చే నెల 14 వరకు యూఏఈలో నిర్వహించనున్నారు. ఇవాళ ఆరంభ మ్యాచ్‌ల్లో ఆసీస్-దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్-వెస్టిండీస్ తలపడతాయి. ఈ కప్ భారత్‌లోనే జరగాల్సి ఉన్నా.. కరోనా కారణంగా వేదికను ఎడారి దేశానికి తరలించారు.ఈనెల 17 నుంచే క్వాలిఫయింగ్ మ్యాచ్‌లతో అధికారికంగా టీ20 ప్రపంచకప్ ఆరంభమైంది.
ప్రధాన మ్యాచ్‌లు మాత్రం సూపర్-12 పేరిట నేటి నుంచి జరుగుతాయి. ఇందులో ఆరేసి జట్లతో రెండు గ్రూపులుండగా టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్-8గా నిలిచిన జట్లు ఇప్పటికే చోటు దక్కించుకున్నాయి. ఇక మిగిలిన నాలుగు జట్ల కోసం ఒమన్‌లో అర్హత మ్యాచ్‌లు జరిగాయి. వీటి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో పాటు స్కాట్లాండ్, నమీబియా జట్లు గ్రూప్ 1, గ్రూప్ 2లో చేరాయి. ఇక అసలు సమరంలో ఒక్కో గ్రూప్‌లోని ప్రతీ జట్టు ఐదు మ్యాచ్‌లు ఆడుతుంది. ఆ తర్వాత ఈ రెండు గ్రూప్‌ల నుంచి టాప్-2గా నిలిచిన నాలుగు జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి.
ఇందులో విజేతలు టైటిల్ కోసం నవంబరు 14న దుబాయ్‌లో బరిలోకి దిగుతాయి. బరిలోకి దిగేది 12 జట్లయినా టైటిల్ ఫేవరెట్లలో మాత్రం కొన్ని జట్లే ఉన్నాయి. 2007లో తొలిసారిగా జరిగిన టీ20 ప్రపంచకప్‌ను ఎంఎస్ ధోనీ సారథ్యంలో టీమిండియా గెలుచుకుంది. ఇప్పటిదాకా మరో టోర్నీ దక్కకపోయినా ఈసారి మాత్రం జట్టు అన్ని విభాగాల్లో పటిష్ఠంగా కనిపిస్తుండడం సానుకూలాంశం. దీనికి తోడు ధోనీ మెంటార్‌గా టీమ్‌ను వెనకుండి నడిపించబోతున్నాడు. భారత్‌తో పాటు వెస్టిండీస్, పాక్, ఇంగ్లండ్, న్యూజిలాండ్‌కు కూడా కప్‌ను గెలుచుకునే సత్తా ఉంది.
