దేశంలో సంచలనం సృష్టించిన పెగాసస్ స్పైవేర్ కేసులో సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఈరోజు సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మనం సమాచార యుగంలో జీవిస్తున్నామని, సాంకేతికత ఎంత ముఖ్యమో గుర్తించాలని సుప్రీంకోర్టు పేర్కొన్నది. గోప్యత హక్కును కాపాడుకోవడం ముఖ్యమని సుప్రీంకోర్టు తెలిపింది. ఇక సుప్రీంకోర్టు పర్యవేక్షణలో పెగాసస్‌పై నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని, పిటిషనర్లు లేవనెత్తిన అంశాలపై నిపుణుల కమిటీ దర్యాప్తు చేస్తుందని సుప్రీం కోర్టు పేర్కొన్నది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తామని తెలియజేసింది. ఏడు అంశాలపై నిపుణుల కమిటి దర్యాప్తు చేయనున్నట్టు సుప్రీంకోర్టు తెలియజేసింది. ఇక నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామన్న కేంద్రం ప్రతిపాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. జాతీయ భద్రత పేరుతో కేంద్రం బాధ్యత నుంచి తప్పించుకోలేదని, కేంద్రం తన బాధ్యతను నిర్వహించాల్సి ఉందని సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొన్నది.