పవర్ పోవడంతో.. ఢీలాపడ్డ ఆయనకు గట్టిగానే ఎదురు దెబ్బలు తగిలాయి. రానురానూ వాటికి అలవాటు పడిపోయారో ఏమో.. ఎవరైనా తమ బాధలు చెబితే.. వెయిట్ ప్లీజ్ అంటున్నారట. మన టైమ్ వచ్చే వరకూ ఓపిక పట్టాలని ప్రవచనాలు ఇస్తున్నారట. ఇంతకీ ఎవరా నాయకుడు? ఏమా హితోక్తులు?
అచ్చెన్న మాటల్లో దూకుడు లేదా?
ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడి తాజా వైఖరి తెలుగు తమ్ముళ్లను ఆశ్చర్య పరుస్తోంది. అధికారంలో ఉన్నా.. విపక్షంలోకి జారినా మొన్నటి వరకు దూకుడుగా కనిపించిన అచ్చెన్నలో.. ESI కేసులో జైలుకెళ్లిన తర్వాత ఎంతో మార్పు వచ్చిందట. వరసగా రాజకీయంగా తగిలిన దెబ్బలు వేడి తగ్గించాయో.. లేక దూకుడికి బ్రేక్‌లు వేశాయో కానీ.. ఆయనలో మునుపటి ఉత్సాహం లేదన్నది టీడీపీ వర్గాల్లో వినిపించే మాట. ఏపీ టీడీపీ అధ్యక్షుడైన తర్వాత కూడా అచ్చెన్న మార్కు పాలిటిక్స్ కనిపించడం లేదన్నది కేడర్ వాదన.
రెండేళ్ల తర్వాత టెక్కలిలో టీడీపీ కేడర్‌తో అచ్చెన్న భేటీ!
అచ్చెన్నకు బాధలు చెప్పుకొన్న కేడర్
ఉన్నట్టుండి ఈ మధ్య అచ్చెన్నాయుడి నుంచి వచ్చిన ఓ మెసేజ్ నిరాశలో ఉన్న కేడర్‌లో జోష్ తీసుకొచ్చింది. ఎమ్మెల్యేగా గెలిచిన రెండేళ్ల తర్వాత టెక్కలి టీడీపీ ఆఫీస్‌లో ఆయన తొలిసారి మీటింగ్ పెట్టారు. పార్టీ శ్రేణులు ఎంతో ఉత్సాహంగా సమావేశానికి వచ్చాయి. గతంలో పనులు చేసి బిల్లులు రాక అప్పులైపోయిన వాళ్లు.. రెండేళ్లుగా రాజకీయంగా ఇబ్బంది పడుతున్నవారు.. పార్టీ ముఖ్యనేతలు జెండా ఎత్తేయడంతో దిశానిర్ధేశం చేసేవారు లేక ఆందోళన చెందుతున్న కేడర్ ఇలా అందరూ అచ్చెన్న ముందు వాలిపోయారు. ఒకరి వెనక ఒకరుగా తమ సమస్యలను ఏకరువు పెట్టారు.
కేడర్‌ను ఆశ్చర్య పరిచిన అచ్చెన్న సమాధానం!
వైసీపీ కార్యకర్త దగ్గర్నుంచి వాలంటీర్ వరకూ తమను ఎలా ఇబ్బంది పెడుతున్నదీ.. అచ్చెన్నకు చెప్పుకొని బోరుమన్నారు తెలుగు తమ్ముళ్లు. ఇదే విధంగా పరిస్థితులు ఉంటే పార్టీ మనుగడ కష్టమని విలపించారట. తమ బాధలకు అచ్చెన్నాయుడు ఓదార్పు ఇస్తారని అంతా ఆశించారు. కానీ.. తమ నాయకుడు చెప్పిన మాటలు విని విస్తుపోయారట. అనవసరంగా ఎవరూ కేసుల్లో ఇరుక్కోవద్దు. గ్రామాల్లో గొడవల్లో తలదూర్చొద్దు. కొద్దిగా సంయమనం పాటించాలి అని ప్రవచనాలు ఇచ్చారట ఏపీ టీడీపీ చీఫ్.
ఈ రెండున్నరేళ్లూ ఆవేశపడొద్దని కేడర్‌కు హితోక్తులు
అక్రమ కేసుల్లో ఇరికిస్తే న్యాయపరంగా పోరాడదాం తప్ప మొండిగా వెళ్లొద్దని కేడర్‌కు గట్టిగానే హితవు పలికారట అచ్చెన్నాయుడు. త్వరలోనే మండల పార్టీల నాయకత్వాలను మార్చి పార్టీకి కొత్తనీరు పోస్తానని హామీ ఇచ్చారట. కాకపోతే ఎవరూ ఈ రెండున్నరేళ్లు ఆవేశపడొద్దు.. ఇప్పుడు టైమ్ బాలేదు.. మనకు కూడా సమయం రావాలి అని వేదాంత ధోరణిలో మాట్లాడారట. ఈసారి వచ్చేది మనప్రభుత్వమే అన్ని లెక్కలూ అప్పుడే తేల్చుకుందాం.. సమయం కోసం ఎదురుచూడాలని క్యాడర్‌కు హితబోధ చేశారట.
అనుభవం కొత్త పాఠాలు నేర్పిందా?
నిన్నమొన్నటి వరకూ దూకుడుగా మాట్లాడుతూ , అధికారపక్షంపై ఒంటి కాలిపై లేచే ఆ అచ్చెన్న.. ఈ అచ్చెన్నా ఒకరేనా అని క్యాడర్ ఆశ్చర్యపోయిందట. కేసులు …అరెస్టులు ఎదుర్కొన్న అనుభవంతో తమ మంచికోసమే అచ్చెన్నాయుడు ఇలా సూచించి ఉంటారని మరికొందరు సరిపెట్టుకున్నారట. మొత్తానికి శాంతంగా.. ఓదార్పుతో ఎర్రన్న సోదరుడు మాట్లాడిన తీరు పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.
