శత్రువుకు శత్రువు మిత్రుడు. ఆ నియోజకవర్గంలో రాజకీయ రగడకు అదే కారణమట. అధికారపార్టీ ఎమ్మెల్యేపై వస్తున్న భూ ఆక్రమణల ఆరోపణల వెనక ఎవరున్నారు? టీడీపీ స్వరం పెరగడానికి ఇంకెవరైనా ముడి సరుకు అందిస్తున్నారా? రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి?
పీలేరులో రూ.400 కోట్ల భూ స్కామ్ జరిగిందని నల్లారి కిశోర్ ఆరోపణ
‘ఇదేలే తరతరాల చరితం..’ అన్నట్టుగా సాగుతున్నాయి చిత్తూరు జిల్లా పీలేరు రాజకీయాలు. ఇక్కడ నల్లారి కుటుంబం వర్సెస్ వైసీపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మధ్య వార్ నడుస్తోంది. 2019 ఎన్నికల తర్వాత వీరి మధ్య గొడవలు ఉండబోవని అనుకున్నారంతా. కానీ.. వైసీపీ నేతల సహకారంతో పీలేరులో 400 కోట్ల భూ స్కామ్ జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ నేత నల్లారి కిశోర్ కుమార్‌రెడ్డి. గ్రామాల్లో జాతీయ రహదారికి ఆనుకుని ఈ స్కామ్ జరిగిందన్నది కిశోర్ వాదన. ఈ అంశమే పీలేరుతోపాటు చిత్తూరు జిల్లా రాజకీయాలను వేడెక్కిస్తోంది.
ఊర్లూ.. సర్వే నెంబర్ల వివరాలు బయటపెట్టిన టీడీపీ
ప్రభుత్వంలోని కొందరు పెద్దల అండ చూసుకుని వైసీపీ నేతలు కబ్జాలు చేస్తున్నారని.. ప్రభుత్వ భూముల్లో లేఅవుట్లు వేసి అక్రమంగా అమ్మేస్తున్నారని చెబుతూ.. ఊర్లు, సర్వే నెంబర్ల వివరాలతో కొన్ని ఫొటోలు బయటపెట్టారు కిశోర్‌కుమార్‌రెడ్డి. దుడ్డుపల్లి, యర్రగుంటపల్లి, బోడిమంట్లవారిపల్లి, గుడ్రేవుపల్లి తదితర గ్రామాల్లో ఓ మంత్రి, ఎమ్మెల్యే అనుచరులు కలిసి ఆక్రమణలు చేశారని ఆయన ఫైర్ అయ్యారు. ఇదే సమయంలో నల్లారి విమర్శలపై వైసీపీ నేతలు కౌంటర్ అటాక్ చేసినా.. అవి పెద్దగా పేలలేదట.
కిశోర్ వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారని ఎమ్మెల్యే చింతల ఎదురుదాడి
2009-2014 మధ్యకాలంలో వేలకోట్ల అవినీతికి పాల్పడింది కిశోర్‌కుమార్‌రెడ్డి అనుచరులేనని ఎమ్మెల్యే చింతల ఫైర్ అయ్యారు. బహిరంగ చర్చకు కూడా సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. అయితే 400 కోట్ల స్కామ్ అని నల్లారి ప్రజల్లోకి వెళ్తుంటే.. గతంలో మీరు అంత దోచుకున్నారని వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు పెద్దగా వర్కవుట్ కావడం లేదని అధికారపార్టీ కేడర్ పెదవి విరుస్తోంది. కిశోర్ వాదన జనంలోకి బలంగా వెళ్లడానికి కారణం.. ఆయన కొన్ని ఆధారాలను బయటపెట్టడమే అన్నది టాక్. ఆ స్థాయిలో వైసీపీ నేతల గ్రౌండ్‌వర్క్ లేదట.
వైసీపీలోని వర్గపోరే కిశోర్‌కు ప్లస్ అవుతుందా?
ఈ ఎపిసోడ్‌లో మరో వాదన కూడా వినిపిస్తోంది. పీలేరు భూకుంభకోణంపై టీడీపీ నేత కిశోర్‌కు సమాచారం ఇచ్చింది వైసీపీలోని ఓ వర్గమేనని అనుమానిస్తున్నారట. నియోజకవర్గంలో ఎంపీ మిధున్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి వర్గాలకు అస్సలు పడటం లేదు. ఈ వర్గపోరు టీడీపీకి ప్లస్ అవుతుందనే ప్రచారం ఉంది. చింతల మెతక వైఖరి కూడా ఈ రగడకు కారణంగా మరికొందరు అభిప్రాయపడుతున్నారట. ఎమ్మెల్యే తీరువల్లే ఎంపీ అనుచరులు ఇలా చేస్తున్నారన్నది పీలేరులో ఇంకో వర్గం ఓపెన్‌గా కామెంట్స్ చేస్తోందట.
సీఎం జగన్‌ను కలిసి ఎమ్మెల్యే చింతల ఏం చెప్పారు?
లేఅవుట్లను పరిశీలించిన సబ్‌కలెక్టర్ జాహ్నవి
ఇదే సమయంలో సీఎం జగన్‌ను కలవడానికి ఎమ్మెల్యే చింతల తాడేపల్లికి వెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది. భూఆక్రమణలపై చింతల నుంచి ఖచ్చితమైన ఫీడ్‌బ్యాక్ తీసుకోవడానికే సీఎంవో నుంచి పిలిచి ఉంటారని ప్రచారం జరుగుతోంది. కాదు కాదు.. నామినేటెడ్ పదవి కోసం తాడేపల్లి వెళ్లారని.. అదే సందర్భంలో కిశోర్‌కుమార్ రెడ్డి అక్రమాలపై విచారణ జరిపించాలని సీఎం జగన్‌కు రెండు పేజీల లేఖ ఇచ్చారనే చర్చ నడుస్తోంది. ఈ వివాదంలో ఎవరి వాదన ఎలా ఉన్నా.. పీలేరులోని పలు ప్రాంతాల్లో వేసిన లేఅవుట్లను పరిశీలించారు సబ్‌కలెక్టర్ జాహ్నవి. పూర్తి విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. దీంతో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. తాము చెప్పిందే నిజమైందని టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాయి. మరి.. రానున్న రోజుల్లో ఈ రగడ ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.