ఆ నియోజకవర్గంలో ఒకసారి నెగ్గినవాళ్లు మరోసారి గెలిచింది లేదు. దానికి తగ్గట్టు ఎమ్మెల్యేగా బ్రహ్మాండంగా ఓట్లేసి గెలిపించిన జనం స్థానిక ఎన్నికల్లోనే గట్టి షాక్ ఇచ్చారు. ఇంకేం ఉంది.. సదరు ఎమ్మెల్యేగారికి చెమటలు పట్టేశాయి. అంతా బాగుందని ఇంట్లో కూర్చుంటే మాజీ అయిపోతామని భయం పట్టుకుంది. ఎన్నికలు ఎప్పుడైనా రానివ్వండి నేను మాత్రం జనంలోనే ఉంటున్నారట. ఆయనెవరో ఈ స్టోరీలో చూద్దాం.
జనం బాట పట్టేందుకు శ్రావణ మాసాన్ని ఎంచుకున్నారు!
విశాఖజిల్లా పెందుర్తి రాజకీయ చైతన్యానికి మారుపేరు. గ్రేటర్ విశాఖ, గ్రామీణ ప్రాంతం కలగలిసి ఉండటంతో నియోజకవర్గం ముక్కలు చెక్కలుగా కనిపిస్తుంది. 2019ఎన్నికల్లో టీడీపీ, వైసీపీలు హోరాహోరీ తలపడగా.. జనసేన ఉనికిని చాటే ప్రయత్నం చేసింది. టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తిపై గెలవడం ద్వారా ఇక్కడ తొలిసారి వైసీపీ జెండా ఎగరేశారు అదీప్ రాజ్. జనానికి తక్కువ వ్యవధిలోనే దగ్గరయ్యారు ఎమ్మెల్యే. ఎన్నికల సమయంలో పెందుర్తి ప్రజలకు చాలా హామీలు ఇచ్చారు అదీప్‌రాజు. అధికారులను వెంట బెట్టుకుని గ్రామ గ్రామాన తిరిగి స్థానిక సమస్యలు పరిష్కరిస్తాను అనేది ఆ హామీలలో ప్రధానమైనది. కోవిడ్ కారణంగా ఈ హామీని నెరవేర్చలేదు. పరిస్థితులు కుదుటపడటం.. శ్రావణ మాసం కావడంతో జనం బాట పడుతున్నారు ఎమ్మెల్యే.
జీవీఎంసీ, పంచాయతీ ఎన్నికల్లో పుంజుకున్న టీడీపీ!
లేట్ చేయకుండా అలర్ట్ అయిన అదీప్!
ఇక నుంచి నెలలోఎక్కువ రోజులు జనం మధ్యనే ఉండాలని.. రాత్రి పగలు గ్రామాలు, వార్డుల్లో తిరిగి సమస్యలు పరిష్కరించాలనేది ఎమ్మెల్యే ఆలోచన. అదీప్‌రాజు చేస్తున్న ఈ ప్రయత్నం వెనక ఉభయతారకమైన ప్రయోజనం ఉందనేది నిర్వివాదం. ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్లు ఉండగానే భవిష్యత్‌కు గట్టి రాజకీయ పునాది వేసుకోవాలనే ప్లాన్ ఉందట. అయితే కారణాలు వేరే ఉన్నాయనే అభిప్రాయం లేకపోలేదు. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఇక్కడ టీడీపీ బలం పుంజుకుంది. వైసీపీ ప్రతిష్టాత్మకంగా భావించిన గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఎమ్మెల్యేను తీవ్రంగా నిరాశపర్చాయి. ఈ నియోజకవర్గ పరిధిలో జీవీఎంసీ ఆరు డివిజన్లు పూర్తిగాను.. నాలుగు డివిజన్లలో కొంత భాగం విస్తరించి ఉంది. వీటిల్లో రెండు డివిజన్లు మాత్రమే వైసీపీ ఖాతాలో పడ్డాయి. పంచాయతీ ఎన్నికల్లో కాస్త మెరుగైన ఫలితాలు వచ్చినప్పటికీ టీడీపీ 36శాతం స్థానాలు దక్కించుకుంది. జిల్లాలో ఉన్న గ్రామీణ నియోజకవర్గాల్లో టీడీపీ ఎక్కువ పంచాయతీలు గెలుచుకున్నదీ ఇక్కడే. దీంతో ఎమ్మెల్యే అదీప్‌కి అసలు విషయం బోధపడింది. గ్రౌండ్ లెవల్లో ఏం జరుగుతుందో కళ్లకు కనిపించింది. దీంతో లేట్ చేయకుండా.. అలెర్ట్ అయ్యారట.
రెండున్నరేళ్ల తర్వాత మాజీ కాకుండా రూట్ మార్చేశారా?
పెందుర్తి సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తారా?
ఎక్కడో లోపం ఉందని గ్రహించారట ఎమ్మెల్యే అదీప్. పథకాలు పంపిణీ అవుతున్నా.. జనానికి కనపడకపోతే వాళ్లు ఎలా రియాక్ట్ అవుతారో అనేది బోధపడిందట ఎమ్మెల్యేకి. దీన్ని సరిచేసుకోకుంటే అంతే సంగతులు అనుకున్నారో.. రెండున్నరేళ్ల తర్వాత మాజీగా మిగులుతానని అనుకున్నారో ఏమో రూట్ మార్చారు. ఇప్పటి నుంచి పార్టీ కేడర్, ద్వితీయ శ్రేణిని బలోపేతం చేయడం ఒక ఎత్తయితే.. నేరుగా ప్రజల సమస్యలు గుర్తించి పరిష్కరించాలని నిర్ణయించుకున్నారు. ఇందు కోసం ప్రతీ నెలా ఎక్కువ సమయం ప్రజాల్లోనే ఉండాలని భావిస్తున్నారు. రాత్రీ, పగలు తేడా లేకుండా గ్రామాల్లోనే తిరగడం ద్వారా ఎమ్మెల్యేగా వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవడం.. 2024 నాటికి ఇబ్బంది లేకుండా చూసుకోవాలనేది ఎమ్మెల్యే ఆలోచన అట. ఇప్పటి నుంచి ఎక్కువ ఎఫర్ట్ పెట్టడం ద్వారా పెందుర్తికి ఉన్న సెంటిమెంట్‌ను తమ నాయకుడు బ్రేక్ చేస్తారని కేడర్ ఉత్సాహంగా ఉందట. ఈ నియోజకవర్గం ఆవిర్భవించిన తర్వాత ఇక్కడ వరసగా రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యే లేరు. మరి.. ఏం అవుతుందో చూడాలి.