వారంతా ఒకప్పుడు రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు. జిల్లాను కనుసైగతో శాసించారు కూడా. మారిన రాజకీయాలు ఒంటబట్టలేదో.. ఉన్న పార్టీలలో ప్రాధాన్యం తగ్గిందో కానీ.. పొలిటికల్ స్క్రీన్‌పై కనిపించడం లేదు. వారెవరో ఇప్పుడు చూద్దాం.
వర్తమాన రాజకీయాల్లో ఒంటరి ప్రయాణం!
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఉద్ధండులైన రాజకీయ నేతలకు కేరాఫ్ అడ్రస్. ఉమ్మడి రాష్ట్రంలో వారి పేరు ప్రస్తావన లేకుండా పొలిటికల్ డిస్కషన్స్ ఉండేవి కావు. కాలం కలిసి రాలేదో.. మారిన రాజకీయాలకు అడ్జెస్ట్ కాలేకపోయారో కానీ.. సడెన్‌గా వెనకబడ్డారు. కోలుకోవడం కష్టమే అన్నది విశ్లేషకుల మాట. అనుచరులు కూడా చెల్లాచెదురు కావడంతో దాదాపుగా ఒంటరిగా మారిన పరిస్థితి.
అడుగులు తడబడి.. రాజకీయాల్లో కనుమరుగు!
నాగం జనార్దన్‌రెడ్డి సీనియర్ రాజకీయ వేత్త. ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన నాగం.. మంత్రిగా పనిచేశారు. తెలంగాణ విభజనకు ముందు రాజకీయంగా ఆయన అడుగులు తడబడ్డాయి. బీజేపీలో కొన్నాళ్లు కొనసాగారు. టీడీపీలో ఉన్నప్పుడు తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్‌లో చేరిపోయారు. కండువాలు మార్చినా ఆయన కాలం కలిసి రాలేదు. 2014లోనే నాగం శకం ముగిసిందన్నది జిల్లా వర్గాలు చెప్పేమాట. ప్రస్తుతం రాజకీయాలను ఆయన అందిపుచ్చుకోలేకపోయారని చెబుతారు.
యెన్నం బీజేపీలో ఉన్నారంటే.. ఉన్నారంతే!
మహబూబ్‌నగర్ ఉపఎన్నికలో ఎమ్మెల్యేగా గెలిచి నాడు విశేష గుర్తింపు తెచ్చుకున్నారు యెన్నం శ్రీనివాసరెడ్డి. టీఆర్ఎస్‌తో రాజకీయ ప్రస్థానం ప్రారంభించినా.. బీజేపీలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. కాంగ్రెస్, బచావో తెలంగాణ, ఇంటిపార్టీలను చుట్టేసి.. తిరిగి కాషాయ శిబిరంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్నారంటే ఉన్నారంతే. రానున్న రోజుల్లో పాలమూరు జిల్లాలో క్రియాశీలక పాత్ర పోషిస్తారా అంటే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట అనుచరులు.
చర్చల్లో లేని మాజీ ఎంపీ మందా
ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన గుర్నాథరెడ్డి రాజకీయ ప్రయాణం సైతం.. ఫుల్‌స్టాప్‌లు, కామాలు అన్నట్టు సాగుతోంది. అధికార పార్టీలో కొనసాగుతున్నా.. చేతిలో పదవి లేదు. ప్రస్తుతం పబ్లిక్‌కు కూడా దూరమయ్యారు. నాలుగుసార్లు నాగర్ కర్నూలు ఎంపీగా ఉన్న మందా జగన్నాథం సైతం చురుకైన పాత్ర వహించడం లేదు. 2014లో ఆయన ఓడిపోయారు. అప్పటి నుంచి మందా పేరు పెద్దగా చర్చల్లోకి వచ్చిందీ లేదు.
హైదరాబాద్‌కే రావుల పరిమితం!
గద్వాల రాజకీయాల్లోకి డీకే అరుణ వచ్చాక.. డీకే సమరసింహారెడ్డి ఉనికి తగ్గిపోయింది. ప్రస్తుతం గద్వాల కాంగ్రెస్ ఇంచార్జ్‌గా ఉన్నా.. గతమెంతో ఘనకీర్తి అని ఫ్లాష్ బ్యాక్ చెప్పుకోవడమే తప్ప వర్తమానం ఏదీ లేదని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయట. కాంగ్రెస్‌లో చురుకుగా ఉండేందుకు ఆయన ఆరోగ్యం సహకరించడం లేదని చెబుతున్నారు. ఇదే విధంగా టీడీపీ సీనియర్ నాయకుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి పేరు జిల్లా రాజకీయాల్లో వినిపించడం లేదు. ఆయన హైదరాబాద్‌కే పరిమితం అయిపోయారు.
కొత్తకోట వ్యూహాలు తేలిపోతున్నాయా?
టీడీపీ ప్రభుత్వంలో చక్రం తిప్పిన కొత్తకోట దయాకర్‌రెడ్డి సైతం ప్రభావం చూపలేకపోతున్నారు. సొంత కేడర్ ఉన్నప్పటికీ ఇతర పక్షాల ఎత్తుగడల ముందు ఆయన వ్యూహాలు తేలిపోతున్నాయట. టీడీపీలో జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నా.. యాక్టివ్ పాలిటిక్స్‌లో కనిపించడం లేదు. రానున్న రోజుల్లో టీడీపీలో కొనసాగుతారో లేదో అన్న చర్చ కూడా ఉంది. మొత్తంగా జిల్లాలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన నాయకులు.. ప్రజల నోళ్లల్లో నలుగుతున్నా.. క్షేత్రస్థాయిలో బలం చాటులేకపోతున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు కీలక ఎన్నికలు చూశారు. కొత్త నాయకత్వాలు వచ్చేశాయి. వారిని కాదని ముందుకు రావడం.. కష్టమే అన్నది విశ్లేషకుల మాట.