తెల్లవారు మన అఖండ భారతాన్ని పరిపాలిస్తున్న రోజుల నుంచీ మనలో స్వతంత్ర కాంక్ష రగిలింది. అది రోజు రోజుకూ పెరిగింది. ఎందరో అమరవీరుల త్యాగఫలంగా మనకు స్వరాజ్యం లభించింది. బ్రిటిష్ వారు మన నేలను పాలిస్తున్న రోజులలోనే సినిమా కూడా తొలి అడుగులు వేసింది. ఆ సమయంలోనే కొందరు సాహసవంతులు ‘క్విట్ ఇండియా’ స్ఫూర్తితో “దూర్ హఠో దూర్ హఠో… ఓ దునియా వాలో… హిందుస్థాన్ హమారా…” అంటూ తమ చిత్రాల్లో నినదించారు. “మాకొద్దీ తెల్లదొరతనం…” అంటూ మన తెలుగు సినిమాల్లోనూ పల్లవించారు. స్వేచ్ఛాపిపాసతో మాతృభూమి దాస్యశృంఖలాలను తెంచడానికి కళాకారులు తమకు చేతనైన విధంగా తపించారు. ఆ తపన తరువాతి కాలంలోనూ కొనసాగింది. మన దేశం కోసం పోరాటం సాగించిన ఎందరో మహావీరుల గాథలతో పలు చిత్రాలు తెరకెక్కి, జనాన్ని ఆకట్టుకున్నాయి. 1949లో కృష్ణవేణి నటించి, నిర్మించిన ‘మనదేశం’లో ఆ నాటి బ్రిటిష్ పాలనలో మన సభలు, సమావేశాలు ఏ రీతిన సాగాయో కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఇక కథానాయకులు దేశభక్తులుగా రూపొందిన చిత్రాలూ ఆకట్టుకున్నాయి.
మనకు స్వాతంత్ర్యం సిద్దించిన ఏడేళ్ళకు కొందరు మన ప్రాంతపు స్వరాజ్య పోరాట వీరుల గాథలు తెరకెక్కించే ప్రయత్నాలు చేశారు. అదే సమయంలో యన్టీఆర్ సైతం తమ ఎన్.ఏ.టి. పతాకంపై ‘అల్లూరి సీతారామరాజు’ వీరగాథను రూపొందించాలని ప్రయత్నించారు. కొన్ని పాటలూ రికార్డ్ చేయించారు. మేకప్ టెస్టులూ సాగాయి. ఎందుకనో అది కార్యరూపం దాల్చలేదు. ‘బొబ్బిలియుద్ధం’లో తెల్లవారిని ఎదిరించిన తెలుగువీరుల గాథ చోటు చేసుకుంది. తమిళంలో రూపొందినా, తెలుగునాట కూడా విజయభేరీ మోగించింది స్వరాజ్య సమరవీరుని కథ ‘వీరపాండ్య కట్టబ్రహ్మన’. తరువాతి రోజుల్లో మన వీరుల గాథలను తమ చిత్రాలలో నాటికలుగా చూపిస్తూ ‘అసాధ్యుడు’ వంటి కొన్ని సినిమాలు తెరకెక్కాయి. 1974లో కృష్ణ ‘అల్లూరి సీతారామరాజు’గా నటించి, నిర్మించిన చిత్రం తెలుగువారిని విశేషంగా ఆకట్టుకొని అనూహ్య విజయం సాధించింది. ఆ తరువాత ‘నాడు-నేడు’ అనే చిత్రంలోనూ స్వరాజ్య పోరాటం చోటు చేసుకుంది. ఆ పై మన సినిమావాళ్ళ దృష్టి చైనా యుద్ధం, పాకిస్థాన్ యుద్ధం పైకి సాగింది. వాటి నేపథ్యంలో మన అమరవీరుల పోరాటాన్ని ఉటంకిస్తూ కొన్ని చిత్రాలు రూపొందాయి. 1980లో దాసరి నారాయణరావు ‘సర్దార్ పాపారాయుడు’లోనూ స్వరాజ్య పోరాట వీరుల గాథను చూపించారు. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పోరాటం బుర్రకథ నేపథ్యంలో వినిపించడమూ అందరినీ అలరించింది.
హిందీలోనూ పలు దేశభక్తి చిత్రాలు రూపొందాయి. ఎక్కువగా సరిహద్దు దాడుల నేపథ్యంలో ఈ మధ్య హిందీ చిత్రాలు తెరకెక్కి అలరించాయి. అయితే ఇరవై ఏళ్ళ కిందట 2001లో ‘లగాన్’లో ఆ నాటి తెల్లవారి జులుమ్ ను చక్కగా తెరకెక్కించారు. ఆ సినిమా విడుదలైన రోజునే జనం ముందు నిలచిన ‘గదర్-ఏక్ ప్రేమ్ కథ’లో స్వరాజ్యం వచ్చాక సాగిన దేశవిభజన నేపథ్యం చోటు చేసుకుంది. ఈ రెండు చిత్రాలు అఖండ విజయం సాధించడం విశేషం. అయితే మన తెలుగులో దేశ స్వతంత్ర పోరాటం నేపథ్యంలో రూపొందిన అనేక చిత్రాలు అంతగా ఆకట్టుకోలేక పోయాయి. ఆ మధ్య వచ్చిన ‘సుభాష్ చంద్రబోస్’, ‘రాజన్న’ చిత్రాలు ఆ కోవకు చెందినవే. ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోన్న రాజమౌళి తాజా చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్.’లో స్వరాజ్య పోరాటం నేపథ్యంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పోలిన పాత్రలో రామ్ చరణ్, కొమరం భీమ్ ను స్ఫురించే పాత్రలో జూ.యన్టీఆర్ నటించారు. ఆ ఇద్దరు అమరవీరుల పాత్రలతో ‘ట్రిపుల్ ఆర్’ రూపొందడమే ఓ సంచలనం. అయితే, వారిద్దరూ ఏక కాలంలో కలుసుకొన్న దాఖలాలు చరిత్రలో లేవు. మరి రాజమౌళి తన ‘ట్రిపుల్ ఆర్’లో ఆ ముచ్చటను ఎలా రూపొందించారో చూడాలని ఆబాలగోపాలం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అక్టోబర్ 13న దసరా కానుకగా వస్తోన్న ‘ట్రిపుల్ ఆర్’ ఏ రీతిన రంజింప చేస్తుందో చూడాలి.