బాలీవుడ్ నటుడు సోనూసూద్ చిక్కుల్లో పడ్డారు. గత మూడు రోజుల నుంచి ఆయన కార్యాలయాలపై ఐటి సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన భారీగా పన్ను ఎగవేతకు పాల్పడ్డట్టుగా తెలుస్తోంది.
గత సంవత్సరం కోవిడ్ కారణంగా దేశవ్యాప్త లాక్డౌన్ ఉన్నప్పుడు ఈ నటుడు చాలా మంది వలస కార్మికులకు వారి సొంత ఇళ్లకు వెళ్లడంలో సహాయపడ్డారు. పేద ప్రజలకు ఆహారం, చదువుకోవడానికి డబ్బు లేని చేయడంతో అందరూ ఆయనను మానవతావాది అంటూ పొడిగారు. చాలా మంది అభిమానులు ఆయనను దేవుడు, రియల్ హీరో అని కూడా అంటారు. ఆయన చేస్తున్న సేవ కారణంగా సోనూసూద్ పేరు మీద ఆలయాన్ని నిర్మించారు. సోను 16 నగరాల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేశాడు. స్కాలర్‌షిప్ వంటి కార్యక్రమాలను చేపట్టాడు. ఇంకా కొంతమందికి ఉద్యోగం ఇప్పించే ప్రయత్నాలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో సోనూసూద్ ఇంటిపై జరుగుతున్న ఐటీ దాడుల విషయమై చాలామంది అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ తాజాగా బయటకు వచ్చిన విషయం ఆయన అభిమానులను కూడా షాక్ కు గురి చేస్తోంది.
Read Also : శ్రీకాళహస్తిలో సమంత వరుస పూజలు !
ఆదాయపు పన్ను శాఖ సోనూ సూద్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ ముంబై కార్యాలయాల్లో సెర్చ్ చేశారు. లక్నో. ముంబై, లక్నో, కాన్పూర్, జైపూర్, ఢిల్లీ, గుర్గావ్‌లోని ఆయనకు సంబంధించిన 28 కార్యాలయాల్లో ఐటీ బృందం ఏకకాలంలో సెర్చ్ కార్యకలాపాలను ప్రారంభించింది. తాజా సమాచారం ప్రకారం సోనూసూద్ పన్ను ఎగవేతకు సంబంధించిన పత్రాలు లభించాయి. సోను సూద్ ఆదాయపు పన్ను శాఖను రూ. 20 కోట్ల వరకు మోసం చేసినట్టు తెలుస్తోంది.
ఆదాయపు పన్ను శాఖ ప్రకారం 2020 జూలై 21న ప్రారంభమైన ఛారిటీ ఫౌండేషన్ కు ఈ సంవత్సరం మార్చి 1 నుండి దాదాపు రూ .18.94 కోట్లు విరాళంగా వచ్చాయి. అందులో కేవలం రూ .1.9 కోట్లు మాత్రమే సామాజిక సేవ కోసం ఉపయోగించారు. అయితే రూ .17 కోట్లు ఇప్పటికీ ఈ ఛారిటీ ఫౌండేషన్ ఖాతాలో ఉన్నాయి. FCRA నిబంధనలను ఉల్లంఘిస్తూ సోనూ సూద్ ఈ ఛారిటీ ఫౌండేషన్‌లో 2.1 కోట్ల రూపాయలు డిపాజిట్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. సోనూ సూద్ అనేక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులలో కూడా పెట్టుబడి పెట్టాడు. బోగస్ బిల్లింగ్ ద్వారా కూడా కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేసినట్లు దర్యాప్తులో తేలింది.
దాదాపు రూ. 65 కోట్ల అవకతవకలకు సంబంధించిన పత్రాలను ఐటి శాఖ రికవరీ చేసినట్టు సమాచారం. సోనూ సూద్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ జైపూర్ లో నకిలీ మౌలిక సదుపాయాల పెట్టుబడి పెట్టినట్లు చూపించి రూ.175 కోట్లు ఎగ్గొట్టడానికి ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఆదాయపు పన్ను శాఖ సోదాలలో రూ .1 కోటి 8 లక్షల నగదు రికవరీ చేశారు. ఇంకా 11 లాకర్‌లు కూడా విచారణలో ఉన్నట్టు తేలింది.