NTV Telugu Site icon

చలికాలంలో ఇంట్లో వెచ్చదనం ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి

బయట చలి విజృంభిస్తోంది. దీంతో ఇంట్లో నుంచి బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. ఎండాకాలంలో చల్లగా ఉండాలని ఇంట్లో ఏసీ వేసుకుంటాం. మరి చలికాలంలో ఇల్లు వెచ్చగా ఉండాలంటే ఏం చేయాలి. శీతాకాలంలో చల్లదనాన్ని తట్టుకుని నిలబడాలంటే ఇంట్లో వెచ్చదనాన్ని ఇచ్చేలా తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. ఈ క్రమంలో చలికాలంలో వెచ్చగా ఉండేలా ఇంటిని ఎలా అలంకరించుకోవాలి. ఇంట్లో వెచ్చదనం ఉండాలంటే ఈ టిప్స్ పాటించి చూడండి.

Read Also: అలర్ట్: చలికాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి

★ చలికాలంలో ఇంట్లో తలుపులు, కిటికీలు మూసి ఉన్నా చల్లదనం ఉంటుంది. దీనికి తోడు ఇంట్లో ఏ వస్తువు ముట్టుకున్నా చల్లగానే తగులుతుంది. ఆఖరికి కూర్చునే సోఫా, పడుకునే మంచం కూడా. అవి చల్లగా ఉన్నాయని.. మనం కూర్చోకుండా, పడుకోకుండా ఉండలేం. అందుకే అవి వెచ్చదనం పంచేలా తగిన ఏర్పాట్లు చేయాలి. ఇందుకోసం సోఫా కవర్లు, పిల్లో కవర్లు, బెడ్‌షీట్లను మందంగా, ఉన్నితో తయారుచేసినవి ఉపయోగించాలి. అలాగే కప్పుకోవడానికి రగ్గులైతే బెటర్. ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవడం వల్ల అటు కూర్చున్నా.. ఇటు పడుకున్నా వెచ్చగా ఉంటుంది.

★ చలికాలంలో రూమ్ ఫ్రెషనర్స్ విషయంలో కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం సువాసనను వెదజల్లే క్యాండిల్స్, అగరుబత్తి వంటివి వెలిగించడం మంచిది. దీనివల్ల ఇంట్లోకి రాగానే చక్కటి సువాసనలు వెదజల్లడంతో పాటు క్యాండిల్స్ మొదలైన వాటి వల్ల ఇంట్లో కొంచెం వెచ్చగా కూడా అనిపిస్తుంది.

★ ఇంట్లో వెచ్చగా ఉండాలంటే కాసేపు లైట్లు వేసి ఉంచడం, క్యాండిల్స్ వెలిగించడం వంటివి కూడా చేయచ్చు. అలాగే ఉదయం పూట ఇంట్లోకి ఎండ పడే అవకాశం ఉన్నట్లయితే తలుపులు, కిటికీలు కాసేపు తెరిచి ఉంచాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇంట్లో వేడిని పుట్టించవచ్చు.

★ ఇంటి అలంకరణలో చెక్కతో చేసిన వస్తువులు శీతాకాలంలో వెచ్చదనాన్ని పంచుతాయి. ముఖ్యంగా తేనె, ముదురు గోధుమ.. వంటి రంగులు అద్దిన చెక్కలు ఇంటికి వెచ్చదనాన్ని అందించడంలో మరింతగా సహాయపడతాయి. కాబట్టి చెక్కతో చేసిన బొమ్మల్ని అక్కడక్కడా అలంకరించడం, గోడలకు వుడెన్ ఫొటోఫ్రేముల్ని తగిలించడం చేస్తే చలికాలంలో ఇంటిని కాస్త వెచ్చగా మార్చుకోవచ్చు.