NTV Telugu Site icon

రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఘర్షణ, కాల్పులు.. ఆరుగురు పోలీసులు మృతి

border clash

border clash

ఈశాన్య రాష్ట్రాల మధ్య సరిహద్దు గొడవలు ఉద్రిక్తంగా మారాయి. అసోం, మిజోరం బోర్డర్‌లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు అసోం పోలీసులు చనిపోయినట్లు సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. ఎస్పీ సహా 60 మందికి పైగా గాయపడ్డారు. ఇరువైపులా ఆస్తులు, వాహనాలు ధ్వంసమయ్యాయి. గతేడాది ఆగస్టులో, ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ సరిహద్దు సమస్యపై ఘర్షణలు జరిగాయి. అవి పునరావృతమయ్యాయి. సరిహద్దులోని 8 వ్యవసాయ పాకలను గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టడమే తాజా ఘర్షణలకు కారణంగా కనిపిస్తోంది. సరిహద్దు సమస్యపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చర్చలు జరిపి వెళ్లిన మరుసటి రోజే ఈ ఘర్షణలు చోటుచేసుకోవడం గమనార్హం. మరోవైపు ఈ ఘర్షణలపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. వివాదాస్పద ప్రాంతం నుంచి పోలీసులను వెనక్కి పంపించాలని డిమాండ్‌ చేస్తున్నారు. వెంటనే జోక్యం చేసుకోవాలంటూ ఇద్దరు సీఎంలు హోంమంత్రి అమిత్‌ షాను ట్విట్టర్‌లో ట్యాగ్‌ చేశారు.

అయితే, సరిహద్దులో ఆక్రమణలపై అస్సాం, మిజోరంలు చాన్నాళ్లుగా ఘర్షణ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అయిత్లాంగ్‌ సెలయేరు సమీపంలో రైతులకు చెందిన 8 వ్యవసాయ పాకలకు ఆదివారం ఉదయం 11.30 గంటలకు దుండగులు నిప్పుబెట్టారని మిజోరం డీఐజీ లాల్బియాకాంగ ఖియాంగ్టే చెప్పారు. ఈ పాకలన్నీ సరిహద్దులో అస్సాం వైపున్న వైరెంగ్టేకి చెందిన రైతులవని వెల్లడించారు. ఈ ఘటనే తాజా ఘర్షణలకు కారణమని భావిస్తున్నారు. ఇక, ఈ ఘర్షణ విషయంలో.. రెండు రాష్ట్రాల సీఎంల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. కచార్‌ సరిహద్దులో పోలీసులతో ప్రజలు ఘర్షణ పడుతున్న వీడియోను మిజోరం ముఖ్యమంత్రి జొరాంథాంగా సోమవారం మధ్యాహ్నం ట్విటర్‌లో ఉంచారు. దీనిపై దృష్టి సారించాలని అమిత్‌ షాకు విజ్ఞప్తి చేశారు. ‘మిజోరం-అస్సాం సరిహద్దు ఉద్రిక్తత’గా పేర్కొన్న ఈ ట్వీట్‌కు ప్రధాని, హోంమంత్రి కార్యాలయాలు, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, అస్సాంలోని కచార్‌ జిల్లా కలెక్టర్‌, కచార్‌ పోలీసులను ట్యాగ్‌ చేసి తక్షణం దీనిని ఆపాలని కోరారు. కారులో కచార్‌ మీదుగా మిజోరం వస్తున్న దంపతులపై గూండాలు, దొంగలు దాడి చేశారంటూ అందుకు సంబంధించిన దృశ్యాలున్న వీడియోతో మరో ట్వీట్‌ చేశారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ స్పందిస్తూ.. లైలాపుర్‌ ప్రాంతంలో చోటుచేసుకున్న ఘర్షణలు, కాల్పులపై మిజోరం ముఖ్యమంత్రి జొరాంథాంగా కల్పించుకోవాలని కోరారు. మరోవైపు.. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సోమవారం అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ, మిజోరం సీఎం జొరాంథాంగాలతో ఫోన్‌లో మాట్లాడారు. వివాదానికి పరస్పర అంగీకారంతో శాంతియుత పరిష్కారం లభించేలా చూడాలని సూచించారు.