‘శంకరాభరణం’ తరువాతే దర్శకులు కాశీనాథుని విశ్వనాథ్ ను అందరూ ‘కళాతపస్వి’ అంటున్నారు. అంతకు ముందు ఆయన తెరకెక్కించిన చిత్రాలను గమనించినా, వాటిలో సంగీతసాహిత్యాలకు, కళకు విశ్వనాథులవారు ఇచ్చిన ప్రాధాన్యం కనిపిస్తుంది. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన హాస్యప్రధాన చిత్రంలో సైతం సాహితీవిలువలు ప్రస్ఫుటంగా కనినిస్తూ ఉంటాయి. ఆయన దర్శకత్వంలో రూపొందిన కుటుంబకథా చిత్రం ‘సిరిసిరిమువ్వ’ తెలుగువారిని విశేషంగా అలరించింది. 1976 డిసెంబర్ 24న విడుదలైన ఈ చిత్రం తరువాత వచ్చిన సూపర్ స్టార్ మూవీస్ సినిమాల నడుమ సైతం విజయవిహారం చేయడం విశేషం!
‘సిరిసిరిమువ్వ’ కథ ఏమిటంటే- పాఠాలు చెప్పుకుంటూ జీవించే రుద్రయ్య అశక్తుడు. అవిటివాడు. ఆయన మొదటి భార్య కూతురు హైమ, రెండో భార్య కూతురు సావిత్రి. ఇద్దరికీ ఎంతో తేడా. మూగపిల్ల అయిన హైమను సవతి తల్లి చిత్రహింసలకు గురి చేస్తుంటుంది. తన కూతురును మాత్రం అల్లారుముద్దుగా పెంచుతుంది. అనాథ అయిన డప్పు కొట్టుకొనే సాంబయ్య పూటకూళ్ళను ఆశ్రయించి జీవనం సాగిస్తూ ఉంటాడు. రుద్రయ్య ఇంటిలో హైమ చేతి వంట అంటే అతనికి ఎంతో ఇష్టం. ఆమె అన్నా ఎంతో అభిమానం. సవతి తల్లి, ఆమె తమ్ముడు భద్రం కలసి ఓ మోసగాడికి ఇచ్చి హైమ పెళ్ళి జరిపించాలనుకుంటారు. సాంబయ్య పట్నంలో ఆ మోసగాడి గురించి తెలుసు కాబట్టి, పెళ్ళి ఆపు చేయాలనుకుంటాడు. పోలీసులు వచ్చి, ఆ మోసగాడిని అరెస్ట్ చేస్తారు. రుద్రయ్య చనిపోయాక, సాంబయ్య, హైమను తీసుకొని పట్నం చేరతాడు. అక్కడ గతంలో సాంబయ్య ద్వారా సాయం పొందిన ఓ స్త్రీ సహకరిస్తుంది. కళాక్షేత్రంలో డబ్బు కోసం నాట్యం చేస్తుంది హైమ. ఎందుకంటే సాంబయ్యకు టీబీ ఉందని, దానిని బాగు చేయించాలని భావిస్తుంది. సాంబయ్య మాత్రం హైమకు ఆ కంపెనీ ఆర్గనైజర్ రాంబాబుతో పెళ్ళి జరిపించాలనుకుంటాడు. కానీ, హైమ మనసు మాత్రం తనతో ఉండే సాంబయ్య చుట్టూ తిరుగుతుంది. సాంబయ్యకు ఆరోగ్యం కుదుట పడుతుంది. హైమ పెళ్ళి జరిపించాలని భావిస్తాడు. ఈ లోగా తనను జైలుకు పంపిన సాంబయ్యపై పగబట్టిన రౌడీ, అతణ్ణి బంధిస్తాడు. చివరకు సాంబయ్యను విడిపించి, రౌడీలను పోలీసులకు పట్టించడంలో మూగదైన హైమ చాకచక్యం చూపిస్తుంది. తాను కోరుకున్న సాంబయ్యతోనే హైమ జీవితం పంచుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.
‘సిరిసిరిమువ్వలు’గా జయప్రద, చంద్రమోహన్ కనిపించిన ఈ చిత్రంలో సత్యనారాయణ, రమాప్రభ, కవిత, దేవదాసు కనకాల, నిర్మలమ్మ, జె.వి.రమణమూర్తి, అల్లు రామలింగయ్య, సాక్షి రంగారావు, బేబీ వరలక్ష్మి, యన్.డి.లక్ష్మి, ఫణికుమారి నటించారు. కె.విశ్వనాథ్ కథ, స్క్రీన్ ప్లే సమకూర్చిన ఈ చిత్రానికి వేటూరి, జంధ్యాల మాటలు రాయడం విశేషం. ఎందుకంటే ఇందులోని పాటలకు ముందు వచ్చే సందర్భాలన్నిటికీ వేటూరి మాటలు కూడా రాశారు. ఇక పాటలన్నీ వేటూరి కలం పలికించింది. కేవీ మహదేవన్ సంగీతం వాటికి తగ్గ బాణీలు కట్టి అలరించింది. పసుమర్తి సమకూర్చిన నృత్యం ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులోని “ఝుమ్మంది నాదం… సై అంది పాదం…”, “గజ్జె ఘల్లు మంటుంటే…”, “అందానికి అందం ఈ పుత్తడిబొమ్మా…”, “రా దిగిరా దివినుండి భువికి దిగిరా…”, “మావూరి దేవుడు…”, “గోదారల్లే ఎన్నెట్లో గోదారల్లే…”, “ఎవరికెవరు ఈ లోకంలో…” వంటి పాటలు విశేషాదరణ చూరగొన్నాయి.
ఈ చిత్రానికి నిర్మాణ పర్యవేక్షణ ఏడిద నాగేశ్వరరావు నిర్వహించారు. ఈ సినిమాను కర్రి లచ్చారెడ్డి, యన్.భాస్కరరెడ్డి, యు.చినవీర్రాజు నిర్మించారు. నిర్మాతలకు మంచి లాభాలు చూపించింది ఈ సినిమా. ఈ చిత్రం తరువాత ఏడిద నాగేశ్వరరావు, ఆకాశం శ్రీరాములుతో కలసి తమ పూర్ణోదయా బ్యానర్ పై ‘శంకరాభరణం, తాయారమ్మ-బంగారయ్య’ వంటి చిత్రాలు నిర్మించారు. తరువాత సోలో ప్రొడ్యూసర్ గా “సాగరసంగమం, స్వాతిముత్యం, స్వయంకృషి, ఆపద్బాంధవుడు” వంటి చిత్రాలు తెరకెక్కించారు. ‘సిరిసిరిమువ్వ’ చిత్రం తెలుగునేలపై ఘనవిజయం సాధించడమే కాదు, మద్రాసులోనూ ప్రదర్శితమై అక్కడి తెలుగువారిని ఆకట్టుకుంది.
దర్శకులు కె.విశ్వనాథ్ కు తాను రాసుకున్న కథలనే అటు ఇటు చేసి మళ్ళీ మళ్ళీ రూపొందించడం అలవాటు. అలా యన్టీఆర్ తో తాను తీసిన ‘నిండుదంపతులు’లోని హీరో పాత్ర ఆధారంగా కృష్ణంరాజుతో ‘అల్లుడు పట్టిన భరతం’, చిరంజీవితో ‘స్వయంకృషి’ రూపొందించారు. ఇక ఈ ‘సిరిసిరిమువ్వ’ బాణీలోనే ‘శుభలేఖ’ కథను తెరకెక్కించారు. ఈ సినిమా ద్వారా ఉత్తమగాయనిగా పి.సుశీలకు జాతీయ అవార్డు లభించగా, బెస్ట్ ఎడిటర్ గా కె.బాబూరావు నేషనల్ అవార్డు అందుకున్నారు. ఆ యేడాదే బెస్ట్ ఎడిటర్ కేటగిరీని ప్రవేశ పెట్టగా, అందులో బాబూరావు విజేతగా నిలచి, జాతీయ అవార్డు అందుకున్న తొలి ఎడిటర్ గా నిలిచారు. ఈ సినిమాను హిందీలో కె.విశ్వనాథ్ దర్శకత్వంలోనే ‘సర్గమ్’ పేరుతో తెరకెక్కించారు. అందులోనూ జయప్రద నాయిక, రిషికపూర్ కథానాయకునిగా నటించిన ఆ చిత్రం కూడా సూపర్ హిట్ అయింది. ‘సర్గమ్’తోనే జయప్రద హిందీ చిత్రసీమలో కాలు మోపింది. ఈ చిత్రంతోనే హిందీలో జయప్రద స్టార్ హీరోయిన్ అనిపించుకోవడం విశేషం.