ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఇండియాలో పలు చోట్ల ఒమిక్రాన్ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ వేరియంట్ కేసులు తెలుగు రాష్ట్రాలలోనూ నమోదవుతున్నాయి. ఏపీతో పోలిస్తే తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఒమిక్రాన్ కేసు నమోదైంది. గల్ఫ్ నుంచి వచ్చిన వ్యక్తికి మూడురోజుల క్రితం ఒమిక్రాన్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో బాధితుడిని హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
Read Also: తెలంగాణలో కొత్తగా మరో 14 ఒమిక్రాన్ కేసులు
ఈ నేపథ్యంలో బాధితుడి కుటుంబ సభ్యులకు కూడా వైద్యులు టెస్టులు నిర్వహించారు. ఆయన భార్య, తల్లికి కరోనా పాజిటివ్ తేలింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వీరి ఉదంతం గురించి తెలుసుకున్న గూడెం గ్రామస్తులు.. 10 రోజుల పాటు తమ గ్రామంతో ఇతరులకు సంబంధాల్ని తెంచుకుంటూ సెల్ఫ్ లాక్ డౌన్ విధించుకున్నారు. దీంతో గూడెం గ్రామంలో హోటళ్లు, కిరాణా షాపులు మూతపడ్డాయి. జనసంచారం లేకపోవడంతో రోడ్లు కూడా నిర్మానుష్యంగా మారాయి. అయితే ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని.. మాస్కులు, శానిటైజర్లు విధిగా వాడాలని అధికారులు సూచిస్తున్నారు.