ఏపీలో ఓటీఎస్‌పై మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. వన్ టైం సెటిల్‌మెంట్ అంటూ ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకంపై మీడియా పేరుతో కొన్ని సంస్థలు టెర్రరిజం చేస్తున్నాయంటూ వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా రిజిస్ట్రేషన్ చేస్తారని, ఈ పథకం వల్ల పేదలకు జరిగే ప్రయోజనాన్ని ప్రజలకు వివరించాల్సింది పోయి విమర్శలు చేస్తారా అంటూ ధ్వజమెత్తారు.
గత టీడీపీ ప్రభుత్వం కనీసం వడ్డీ కూడా మాఫీ చేయకపోయినా ఎందుకు ప్రశ్నించ లేదని, ఈ పథకం వల్ల 6వేల కోట్ల రూపాయల భారం నుంచి ప్రజలకు రక్షణ లభిస్తుందని ఆయన తెలిపారు. టిడ్కో హౌస్ లకు డబ్బులు కట్టిన వాళ్ళు ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, మూడు, నాలుగు అంతస్తుల్లో ఉండాలంటే పెద్ద వయసు వాళ్ళకు సాధ్యం అవుతుందా? అని ప్రశ్నించారు. ఇంటి పై అప్పు తీర్చటానికి 15, 20 ఏళ్ళు పడుతుందని, ఇటువంటి భారం పడకుండా కేవలం 10 వేల రూపాయలతో వన్ టైం సెటిల్‌మెంట్ ద్వారా పూర్తి హక్కులు ఇస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారు? అంటూ ఆయన మండిపడ్డారు.