పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కుదిపేస్తున్న అంశం పెగాసస్… ఉభయసభల్లోనూ ఇదే వ్యవహారం రభస సృష్టిస్తోంది… పెగాసస్ వ్యవహారంపై ప్రభుత్వం చర్చించాల్సిందేనంటూ 9 రోజులుగా ప్రతిపక్షాలు ఉభయ సభలనూ స్తంభింపజేస్తున్నాయి. అలాగే 50 పని గంటల్లో 40 పనిగంటలను సభ కోల్పోయిందని అధికారికంగా ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాలకు జరిగిన అవాంతరాల వల్ల 133 కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.. అయితే, ప్రతిష్ఠంభన తొలగిపోయేందుకు ఏమాత్రం సూచనలు కూడా కనిపించడంలేదు.. పెగసస్ వివాదం కారణంగా, ప్రధాన మోడీ నేతృత్వంలోని ప్రభుత్వానికి, ప్రతిపక్షాల మధ్య నెలకున్న ప్రతిష్ఠంభనతో, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు కలిగిన అంతరాయం వల్ల, ప్రజల కట్టిన పన్నుల సొమ్ములో సుమారు 133 కోట్ల రూపాయలకు పైగానే వృధాగా నష్టపోయనట్లు అంచనా వేస్తున్నారు..
జులై 19వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి “పెగసస్” కుంభకోణం పై చర్చను డిమాండ్ చేస్తూనే ఉన్నాయి ప్రతిపక్షాలు.. కేవలం ప్రభుత్వాలకే “ఇజ్రాయెల్ స్పైవేర్” సంస్థ అమ్మిన సాఫ్టువేర్ నుపయోగించి, దేశంలోని ప్రముఖుల ఫోన్లను హ్యాక్ చేసి, సంభాషణలు, సమాచారం పై నిఘా పెట్టినట్లుగా వచ్చిన కథనాలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి.. విపక్ష రాజకీయ నాయకులు, పాత్రికేయులు, న్యాయమూర్తులు, ఇతర ప్రముఖలే లక్ష్యంగా ఇజ్రాయెల్ స్పైవేర్ కు చెందిన “పెగసస్”సాఫ్టువేర్ ను ఉపయోగించి, వారి ఫోన్ల సంభాషణల పై నిఘా పెట్టారని వచ్చిన ఆరోపణల పై సిట్ట్ంగ్ జడ్జి లేదా మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి దర్యాప్తు జరిపించాలని పట్టుబడుతున్నాయి ప్రతిపక్షాలు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 11 ప్రముఖ మీడియా సంస్ధల సంయుక్త పరిశోధనా కథనాలపై దర్యాప్తును కోరుతున్నాయి.. అయితే, ప్రతిపక్షాల డిమాండ్‌ను నిర్ద్వందంగా కొట్టిపారేస్తోంది మోడీ సర్కార్.. పార్లమెంట్‌లో ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ చేసిన ప్రకటన సరిపోతుందని చెబుతున్నారు.. మరోవైపు ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా మంత్రి కాకముందు ఈ ఫోన్ ట్యాపింగ్‌కు గురైనవారిలో ఒకరుగా ఉన్నారని పరిశోధనాత్మక వార్తా కథనాలలో వెల్లడి కావడం ఆసక్తికరంగా మారింది.
ఇక, ప్రతిపక్షాలది అనవసరమైన రాద్ధాంతం అని కొట్టిపారేస్తోంది ప్రభుత్వం.. పేరు వెల్లడించని ప్రభుత్వవర్గాల సమాచారం అంటూ శనివారం మీడియాకు అందిన ఓ ప్రకటనను బట్టి, ప్రతిష్ఠంభన కారణంగా సుమారు 54 గంటలు నడవాల్సిన లోకసభ, కేవలం 7 గంటలు మాత్రమే పనిచేయగలిగిందని, 53 గంటలు సభాకార్యక్రమాలు నిర్వహించాల్సిన రాజ్యసభ, కేవలం 11 గంటలు మాత్రమే పనిచేయగలిగింది. ఇంతవరకు పార్లమెంట్ ఉభయ సభలు 107 గంటలు మేరకు సభా కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉండగా, కేవలం 18 గంటలు మాత్రమే పనిచేయగలిగింది. ఆవిధంగా, సుమారు 89 పని గంటల సమయం వృథా అయుంది. దీనివల్ల ప్రభుత్వ ఖజానా, ప్రజాధనం సుమారు 133 కోట్ల రూపాయలకు పైగానే వృథా అయ్యిందని ప్రకటనలో పేర్కొంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా కొనసాగకుండా కాంగ్రెస్ పార్టీనే అడ్డుపడుతుందంటూ, బీజేపీ ఎంపీల సమావేశంలో 4 రోజుల క్రితం ప్రధాని మోడీ విమర్శించిన తర్వాత ఈ అనధికార ప్రకటన రావడం గమనార్హం.