NTV Telugu Site icon

‘కారు’ను వెంటాడుతోన్న‘చపాతీ రోలర్’.. హుజురాబాద్‌లో ఏం చేస్తుందో..?

తెలంగాణలో ఎన్నికలు వచ్చాయంటే చాలు అధికార టీఆర్ఎస్‌ పార్టీని ‘చపాతీ రోలర్‌’ వెంటాడుతూనే వస్తోంది.. స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల కమిషన్‌ కేటాయించే ‘రొట్టెల పీట’ (చపాతీ రోలర్‌) కారు గుర్తుకు తలనొప్పిగా మారుతోంది. ఇప్పటికే తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో దీని ప్రభావం స్పష్టంగా కనిపించింది. కొన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్‌ పార్టీ అభ్యర్థుల ఓటమి ప్రధాన కారణం ఈ చపాతీ రోలరే అని నిర్ధారణకు వచ్చిన టీఆర్ఎస్‌ నేతలు.. అంతే కాదు, దుబ్బాక బై పోల్‌లోనూ చపాతీ రోలర్.. కారును ఓడించడానికి సాయం చేసిందని చెబుతుంటారు.. అయితే, ప్రస్తుతం హుజురాబాద్‌ ఉప ఎన్నికల సమయంలోనూ అధికార పార్టీకి ‘చపాతీ రోలర్‌’ టెన్షన్‌ పట్టుకుందట.. సర్వేల ఫలితాలు ఎలా ఉన్నా.. రొట్టెల పీట మళ్లీ ఏం చేస్తుందో అనే భయం మాత్రం వెంటాడుతూనే ఉందట నేతలను.

ఇక, హుజూరాబాద్ ఉప ఎన్నికలో ప్రజా ఏక్తా పార్టీ అభ్యర్థి సిలివేరు శ్రీకాంత్‌ పోటీలో ఉన్నారు.. ఆయనకు ‘చపాతీ రోలర్’ గుర్తును కేటాయించింది ఎన్నికల సంఘం.. బ్యాలెట్‌ పేపర్‌లో చపాతీ రోలర్‌ గుర్తు కారును పోలి ఉండడంతో.. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్‌ ఓడిపోవాల్సి వచ్చింది. మరికొన్ని ప్రాంతాల్లో చపాతీ రోలర్‌ గుర్తుకు అనూహ్యంగా ఓట్లు వచ్చిన సందర్భాలున్నాయి. మరోవైపు.. హుజురాబాద్‌ ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.. టీఆర్ఎస్‌ మాజీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామా చేయడంతో ఈ ఎన్నికలు రాగా.. ఈ సారి ఆయన బీజేపీ నుంచి బరిలోకి దిగారు. తమ సిట్టింగ్‌ స్థానం కావడంతో.. ఎలాగైనా విజయం సాధించాలన్న పట్టుదలతో ఉన్న టీఆర్ఎస్‌ పార్టీ… గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను పోటీకి పెట్టింది.. మంత్రి హరీష్‌రావు సహా పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు.. విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు.. బల్మూర్ వెంకట్ ను తమ అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీ కూడా తన శక్తి మేరకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో.. ప్రతీ ఓటు కీలకంగా మారింది.. ఒక్కోసారి ఒక్క ఓటు కూడా ముఖ్యమే అవుతుంది.. అదే గెలుపు ఓటములను నిర్ణయించింది.. అటువంటిది కారు గుర్తు, రొట్టెల పీట (చపాతీ రోలర్) గుర్తు చూడటానికి కాస్త ఒకే విధంగా ఉండటంతో హుజురాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్‌కు నష్టం జరిగే అవకాశం కూడా ఉంది.

ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉన్న రొట్టెల పీట, కర్ర లేదా చపాతీ రోలర్‌ గుర్తును ఇండిపెండెంట్ లేదా రిజిస్టర్డ్ పార్టీ అభ్యర్థులకు కేటాయిస్తుంది ఎన్నికల కమిషన్‌.. ముందస్తు ఎన్నికల్లో దాదాపు 10-15 స్థానాల్లో ఈ గుర్తు తీవ్ర ప్రభావాన్నే చూపింది.. అప్పటి నుంచి ఈ గుర్తుపై టీఆర్ఎస్ ఈసీతో పోరాటం చేస్తూనే ఉంది.. నేరుగా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకెళ్లారు ఆ పార్టీ నేతలు. కానీ, ఎన్నికల సంఘం మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థనల్ని ఇప్పటి వరకు పట్టించుకున్న దాఖలాలు లేవు.. గత ఏడాది జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లోనూ చపాతీ రోలర్ గుర్తు పొందిన అభ్యర్థికి 3,570 ఓట్లు వచ్చాయి.. ఆ ఎన్నికల్లో ఆ అభ్యర్థి నాల్గో స్థానంలో నిలిచాడు.. కానీ, బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు.. 1,079 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీనికి ప్రధాన కారణం.. కారు గుర్తును పోలిన చపాతీ రోలర్ గుర్తేనని టీఆర్ఎస్‌ శ్రేణులు వాపోయిన సందర్భాలు ఎన్నో.. ఇప్పుడు హుజురాబాద్‌ ఉప ఎన్నికల సమయంలో మరోసారి ‘చపాతీ రోలర్’ గుర్తు చర్చగా మారిపోయింది. మరి దీని ప్రభావం ఎలా ఉండబోతోంది..? గెలుపోటములను ప్రభావితం చేస్తుందా? అనే టెన్షన్‌ మాత్రం టీఆర్‌ఎస్‌ నేతలను వెంటాడుతూనే ఉంది.