కరోనా సెకండ్ వేవ్ సమయంలో నిత్యవసర ధరలు ఆకాశాన్ని తాకాయి. ముఖ్యంగా నిత్యం వంటల్లో ఉపయోగించే వంటనూనె ధరలు ఆకాశాన్ని తాకాయి. సామాన్యుడికి వంటనూనెను కొనుగోలు చేయడం తలకు మించిన భారంగా మారింది. వంటనూనెను విదేశాలనుంచి దిగుమతి చేసుకుంటున్నారు. అయితే, విదేశాల్లో సోయాబీన్స్, పామాయిల్ ను బయోఉత్పత్తుల కోసం వినియోగిస్తుండటంతో ధరలు పెరిగాయి. ప్రస్తుతం కొత్త పంట చేతికి వస్తుండటంతో కేంద్రం దిగుమతి సుంకాన్ని తగ్గించింది. పామాయిల్ పై దిగుమతి సుంకం 10 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించగా, సోయాబీన్‌పై 7.5 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించింది. దీంతో దేశీయంగా వంటనూనె ధరలు రూ.4 నుంచి రూ.5 వరకు తగ్గనున్నాయి. తగ్గించిన దిగుమతి సుంకం నిన్నటి నుంచే అమల్లోకి వచ్చినట్టు కేంద్రం ప్రకటించింది.