ప్రపంచ వ్యాప్తంతా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ ట్రెండ్ భారత్‌లోనూ కనిపిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలలో కేసులలో పెరుగుదల కనిపిస్తోంది. దీనికి ఒమిక్రాన్ వేరియంట్ కారణం కావచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు. ఐతే, ఇప్పటి వరకు కేసుల సంఖ్య గణనీయంగా పడిపోవటంతో చాలా మంది మాస్కులు ధరించకపోవటం చూస్తున్నాం. ఇప్పుడు థర్డ్ వేవ్ భయంతో మళ్లీ మాస్కులకు గిరాకీ పెరిగింది.
ప్రస్తుతం కావాల్సినంత మాస్క్‌ల స్టాక్ ఉన్నా వాటి రేట్లు మాత్రం తగ్గలేదు. ఉదాహరణకు రోజుకు 30ల లక్షల సర్జికల్ మాస్కులను అందించే సామర్థ్యం హైదారాబాద్‌కు ఉంది. దీనికి తోడు ఢిల్లీ నుంచి రోజుకు 10 లక్షల మాస్కులు దిగుమతి అవుతున్నాయి. అయినా , మూడు పోరల మాస్కులను మెడికల్ హాళ్లలో 10 నుంచి 15 రూపాయలకు అమ్ముతున్నారు.
హైదరాబాద్ నగర శివార్లలో పది మాస్కుల తయారీ యూనిట్లు ఉన్నాయి. ఒక్కో యూనిట్‌లో రోజుకు కనీసం లక్ష మాస్కులు తయారవుతాయి. ఐనప్పటికీ, దళారుల పుణ్యమా అని మాస్కుల ధరలు మాత్రం దిగిరావట్లేదు. దాంతో, వినియోగదారులు ప్రతి మాస్క్‌పై తయారీ ధర కంటే 5 నుంచి 10 రెట్లు ఎక్కువ చెల్లించవలసి వస్తోంది. కోవిడ్ -19 ఫస్ట్, సెకండ్ వేవ్ వచ్చినపుడు మాస్క్‌ల కొరత ఉంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. స్థానికంగా ఉత్పత్తి చాలా రెట్లు పెరిగింది. ఐనా కూడా ధరలు చాలా వరకు మారలేదని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.
ప్రస్తుతం తయారీదారులు ఒక మాస్క్‌ని రీటెయిలర్లకు 90 పైసల నుంచి 1 రూపాయి ధరకు విక్రయిస్తున్నారు. కానీ, గతంలో దుకాణ దారులు 8, 9 రూపాయలకు సప్లయర్ల నుంచి కొనాల్సి వచ్చింది. కాబట్టి వినియెగదారులకు ఎక్కవ ధరకు అమ్మటంలో న్యాయం ఉంది. కానీ ఓ మాస్క్ వారికి 2 రూపాయల కంటే తక్కువ ధరకే వస్తోంది. అయినా రీటెయిలర్లు ధర తగ్గించలేదు. నగరంలో తగినన్ని యూనిట్లు ఉన్నందున తమ వైపు నుండి ధరలు పెరగవని మాస్క్ తయారీదారులు అంటున్నారు. కానీ దుకాణదారులు తమ లాభాలను ఏమాత్రం తగ్గించుకునే పరిస్థతి కనిపించటం లేదు. వినియోదారుల నుంచి దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఓమిక్రాన్ ఆందోళన నేపథ్యంలో వారం రోజులుగా మాస్కులకు మళ్లీ డిమాండ్ పెరిగింది. నిపుణులు చెపుతున్న దానిని బట్టి ఒమిక్రాన్ R-విలువ డెల్టా వేరియంట్ కన్నా నాలుగు రెట్లు ఎక్కువ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన నేపథ్యంలో మాస్క్ ధరించటం తప్పనిసరి. కాబట్టి ఇంటి నుంచి బయటకు వెళితే త్రీ-ప్లై సర్జికల్ మాస్క్‌లు గానీ, N95 మాస్క్‌లు ధరించడం ఉత్తమం. ఓమిక్రాన్ వేరియంట్‌లో ట్రాన్స్‌మిషన్ రేటు ఎక్కువగా ఉన్నందున దానిని ప్రభావ వంతంగా ఎదుర్కొనే మొదటి ఆయుధం మాస్క్ ధరించటమేనని అందరూ గుర్తించాలి.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 41 లక్షల 71 వేల N 95 మాస్కులు అందుబాటులో ఉన్నాయి. అలాగే కోటీ యాబై లక్షల త్రీప్లై (3ply) మాస్కులు, 8 లక్షల 62 వేల పీపీఈ కిట్స్, 8 లక్షల 71 వేల హోం ట్రీట్‌మెంట్ కిట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ ఆస్పత్రులలో 21 వేల 846 రెగ్యులర్ పడకలు, 21 వేల 550 ఆక్సిజన్ బెడ్లు, 11 వేల 845 ఐసీయూ బెడ్స్ అన్నీ కలిపి మొత్తం 5లక్షల54 వేల 442 పడకలు ఉన్నాయి. వీటిలో 1,214 పడకలు ప్రస్తుతం పేషెంట్లతో ఉన్నాయి.
మరోవైపు,తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 20కి చేరింది. భయపడాల్సిన అవసరం లేదని రాష్ట్ర వైద్య శాఖ అంటోంది. అయితే తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచించింది. మరోవైపు, ఒమిక్రాన్ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకే ప్రభుత్వాలు సన్నధ్దమయ్యాయి.
…