తెలుగు చిత్రసీమలో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు దాని పరిష్కారం నడుం బిగించేవారిలో ముందువరుసలో ఉంటారు దగ్గుబాటి సురేశ్ బాబు. అంతకు ముందు ఆయన తండ్రి స్టార్ ప్రొడ్యూసర్ డి.రామానాయుడు కూడా అదే తీరున తెలుగు సినిమా అభివృద్ధి కోసం తనవంతు కృషి చేశారు. ఇప్పుడు తెలుగు సినిమా రంగంలో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దడానికి సురేశ్ బాబుతో పాటు పలువురు ప్రముఖ నిర్మాతలు ప్రయత్నం సాగిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అక్కడ మన తెలుగు సినిమాను బ్రతికించుకోవడానికి పలువురు పలు విధాలా కృషి చేస్తున్నారు. త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో అందరి చూపు సురేశ్ బాబు వైపు సాగుతోంది. ఎందుకంటే నిర్మాతగానే కాదు, స్టూడియో అధినేతగా, డిస్ట్రిబ్యూటర్ గా, ఎగ్జిబిటర్ గా సురేశ్ బాబుకు అపారమైన అనుభవం ఉంది. అందువల్ల సురేశ్ బాబు ఏదో ఒక పరిష్కారంతో రాబోయే సినిమాలకు సులువైన మార్గం చూపిస్తారని సినీజనం ఆశిస్తున్నారు.
తండ్రి బాటలో…
డి.రామానాయుడు పెద్దకొడుకుగా సురేశ్ బాబు 1958 డిసెంబర్ 24న జన్మించారు. మద్రాసులోని డాన్ బోస్క్ స్కూల్ లోనూ, లయోలా కాలేజ్ లోనూ విద్యనభ్యసించారు సురేశ్. తరువాత యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ లో డిగ్రీ చదివారు. స్వదేశం వచ్చిన తరువాత నుంచీ తండ్రి చిత్ర నిర్మాణంలో పాలు పంచుకుంటూ సాగారు.
ఆయన తండ్రి డి.రామానాయుడు నిర్మాతగా గిన్నిస్ బుక్ ఆప్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు. తండ్రి చాటున బిడ్డగా ఉంటూనే సురేశ్ బాబు 1990లో ‘బొబ్బిలిరాజా’తో నిర్మాతగా మారారు. అప్పటి నుంచీ తమ సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేశ్ బాబు పలు చిత్రాలు నిర్మించారు. తన తమ్ముడు వెంకటేశ్ ను టాలీవుడ్ స్టార్ హీరోస్ లో ఒకరిగా నిలపడం కోసం సురేశ్ బాబు చేసిన కృషిని ఎవరూ మరచిపోలేరు. ఇక నిర్మాతగా తన ప్రతి చిత్రంలోనూ ఏదో ఒక కొత్తదనం చొప్పించడానికి సురేశ్ బాబు సదా ప్రయత్నించేవారు.
తెలుగులోనే కాదు, దక్షిణాదిన ఎందరో ప్రముఖ నిర్మాతల తనయులు తండ్రుల బాటలోనే పయనిస్తూ నిర్మాతలయ్యారు. అయితే సురేశ్ బాబు మాత్రం కాలానికి అనుగుణంగా సాగుతూ చిత్రనిర్మాణం సాగించారు. అరుదైన విజయాలను సొంతం చేసుకున్నారు. తండ్రి తనకు ఆస్తిగా ఇచ్చిన నిర్మాణసంస్థ, స్టూడియోస్, పంపిణీ సంస్థ, పబ్లిసిటీ సంస్థ వంటి వాటిని ఎంతో చాకచక్యంగా నిర్వహించారు. ముఖ్యంగా తెలుగునాట థియేటర్లను లీజుకు తీసుకొని మూతపడిపోనున్న ఎన్నో సినిమా హాళ్ళకు ఆ దుస్థితి పట్టకుండా కాపాడిన ఘనత సురేశ్ బాబుదే అని చెప్పవచ్చు. ఇక క్రేజీ కాంబినేషన్స్ లో రూపొందే చిత్రాలకు భాగస్వామిగానూ ఉంటున్నారు సురేశ్ బాబు. ఈ మధ్య మునుపటిలా వేగంగా చిత్రనిర్మాణం సాగించడం లేదు.
సురేశ్ బాబు తనయుడు రానా నవతరం నాయకునిగా సాగిపోతున్నారు. రానా సైతం తండ్రి బాటలో పయనిస్తూ కొంతకాలం గ్రాఫిక్స్ నిర్వహించారు. తరువాత బాబాయ్ వెంకటేశ్ ను ఆదర్శంగా తీసుకొని నటనలో అడుగుపెట్టారు. సురేశ్ బాబు నిర్వహణలోనే రామానాయుడు ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ సాగుతోంది. అందులో శిక్షణ పొందిన వారికి తమ చిత్రాల ద్వారా అవకాశాలూ కల్పిస్తున్నారు. కరోనా కల్లోలంలో సతమతమై పోయిన తెలుగు సినిమాను మళ్ళీ మునుపటి స్థితికి తీసుకురావడానికి ఎందరో నడుం బిగించారు. వారిలో ముందు వరుసలో ఉన్నారు సురేశ్ బాబు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని సినిమాలు థియేటర్లలో కన్నా ఓటీటీల్లో విడుదలయితేనే మంచిదని ఆయన భావించారు. అందువల్లే తన తమ్ముడు వెంకటేశ్ నటించిన “నారప్ప, దృశ్యం-2” చిత్రాలను ఓటీటీలోనే విడుదల చేశారు. ఆయన బాటలోనే మరికొందరు నిర్మాతలు పయనించారు. కానీ, థియేటర్లలో సందడి చేసిన చిత్రాలను చూసి, చాలామంది మళ్ళీ సినిమా హాళ్ళలోనే తమ సినిమాలు నడవాలని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ గవర్నమెంట్ తో చర్చలు సాగించాలని చాలామంది తెలుగు సినిమా జనం భావిస్తున్నారు. వారికి దిశానిర్దేశం చేయడంలో సురేశ్ బాబు ముందుంటారని సినీజనం ఆశిస్తున్నారు. ఏమవుతుందో చూడాలి.